Rohit Sharma: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Rohit Sharma Meets Maharashtra CM Fadnavis Speculation on Political Entry

  • రోహిత్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ 
  • టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ 
  • 11 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌ల్లో 4301 పరుగులు 
  • డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున రోహిత్ అత్యధిక పరుగులు

టెస్టులకు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముంబైలోని సీఎం అధికారిక నివాసం 'వర్ష'లో రోహిత్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ అనంతరం ఫడ్నవీస్ తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా స్పందించారు. ‘‘భారత క్రికెటర్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం వర్షలో కలవడం, మాట్లాడటం సంతోషంగా ఉంది. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఆయనకు తదుపరి ప్రయాణంలో విజయం సాధించాలని నా శుభాకాంక్షలు తెలియజేశాను!’’ అని పేర్కొంటూ రోహిత్‌తో దిగిన ఫొటోలను పంచుకున్నారు. సీఎంతో రోహిత్ భేటీ, ఆపై ఫొటోలు బయటకు రావడంతో రోహిత్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నాడన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చలో మునిగిపోయింది. అయితే, ఈ వార్తలకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లభించలేదు.

దాదాపు 11 సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్‌లో కొనసాగిన రోహిత్ శర్మ తాజాగా సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. నవంబర్ 2013లో వెస్టిండీస్‌పై అద్భుతమైన అరంగేట్రం చేసిన ఆయన మొత్తం 67 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ప్రయాణంలో 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో సాధించిన 212 పరుగులు ఆయన కెరీర్‌లోనే అత్యధిక స్కోరు. దీంతో టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన 16వ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

2013లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తన తొలి టెస్టులోనే రోహిత్ 177 పరుగులతో అద్భుత ప్రతిభ కనబరిచాడు. టెస్ట్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో ఆరంభంలో రోహిత్ కొంత ఇబ్బంది పడ్డాడు. 2013 నుంచి 2018 మధ్య కాలంలో కేవలం 27 టెస్టులు ఆడి 47 ఇన్నింగ్స్‌లలో 39.63 సగటుతో 1,585 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, పది అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

2019లో ఇన్నింగ్స్ ఓపెనర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆయన టెస్ట్ కెరీర్‌లో కీలక మలుపు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలతో మళ్లీ సత్తా చాటాడు. ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో ఆడిన 40 టెస్టుల్లో 41.15 సగటుతో 2,716 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో నిలిచాడు. 2023లో యూకేలో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో జట్టు ఓటమిపాలైంది.

Rohit Sharma
Devendra Fadnavis
Maharashtra CM
Indian Cricketer
Retirement
Political Entry
Test Cricket
Mumbai
Cricket
Politics
  • Loading...

More Telugu News