S-400 Missile System: ఎస్400 ధ్వంసం చేశామంటిరి కదా.. తమ దేశ సైన్యాన్ని నిలదీసిన పాక్ జర్నలిస్ట్

- భారత ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్ బేస్ పర్యటన ఫొటోతో ట్వీట్
- మోదీ వెనక ఎస్400 క్షిపణి విధ్వంసక వ్యవస్థ కనిపిస్తోందని వెల్లడి
- పాక్ సైన్యం (డీజీ-ఐఎస్‌పీఆర్) తప్పుడు ప్రచారం చేసిందన్న పాక్ జర్నలిస్టు
పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన పర్యటన, పాకిస్థాన్ సైన్యం ప్రచారంలోని డొల్లతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. తాము జరిగిన ఘర్షణల సమయంలో ఈ వైమానిక స్థావరాన్ని, అక్కడి ఎస్-400 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామని గొప్పలు చెప్పుకున్న పాకిస్థాన్ వాదనలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్‌కు చెందిన ఒక జర్నలిస్టు స్వయంగా తమ దేశ సైనిక అధికార ప్రతినిధి (డీజీ-ఐఎస్‌పీఆర్) అహ్మద్ షరీఫ్ చౌదరిపై విరుచుకుపడ్డారు. తప్పుడు విజయాలు ప్రకటించుకుంటున్నారని, వాస్తవానికి భారత దళాలు పాకిస్థాన్‌లోని కీలక స్థావరాలపై దాడులు చేశాయని ఆయన అంగీకరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, సదరు పాకిస్థానీ జర్నలిస్టు ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో ఎస్-400 క్షిపణి వ్యవస్థ ముందు నిలబడి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని చూపుతూ మాట్లాడారు. "ఈ స్థావరాన్ని, ఈ ఎస్-400 వ్యవస్థను మేం నాశనం చేశామని చెప్పుకున్నాం. కానీ, నరేంద్ర మోదీ అదే ఎస్-400 ముందు నిలబడి తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మేం గెలవలేదు. 1971 తర్వాత భారతదేశం పాకిస్థాన్‌లోని ప్రతి నగరం, ప్రతి స్థావరంపై దాడి చేయగలదని నిరూపించింది. మీ దేశంలో ఏ మూల కూడా సురక్షితం కాదని మోదీ పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇచ్చారు," అని ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. మోదీ తమ నీటి సరఫరాను నిలిపివేశారని, తమవారిలో 50 మందిని హతమార్చారని కూడా ఆయన ఆరోపించారు.
