India-Pakistan Relations: అప్పటి వరకు సిందు జల ఒప్పందం నిలిపివేత, పీవోకేను పాకిస్థాన్ ఖాళీ చేయడమే మిగిలి ఉంది: భారత్

- సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసేదాకా సిందు జలాల ఒప్పందం నిలిపివేత
- "ఆపరేషన్ సిందూర్" అనంతర పరిణామాలపై స్పందించిన విదేశాంగ శాఖ
- పీఓకే సమస్యకు ద్వైపాక్షిక చర్చలే పరిష్కారం, మూడో వ్యక్తి ప్రమేయం వద్దు
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ దాని దుష్పరిణామాలను ఎదుర్కోక తప్పదని భారత్ మరోసారి తీవ్ర స్వరంతో హెచ్చరించింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కేవలం భారత్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సరిహద్దు ఆవలి నుంచి ఉగ్ర కార్యకలాపాలకు పాక్ తన మద్దతును పూర్తిగా ఉపసంహరించుకునేంత వరకు సింధూ నదీ జలాల ఒప్పందంపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిలిపివేత కొనసాగుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది.
'ఆపరేషన్ సిందూర్' అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. పీఓకే అంశాన్ని పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలే ఏకైక మార్గమని భారత్ పునరుద్ఘాటించింది. జమ్ముకశ్మీర్‌కు సంబంధించి భారతదేశ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని, ద్వైపాక్షిక సంప్రదింపులు మినహా మరే ఇతర మధ్యవర్తిత్వానికి అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
పీఓకేను పాకిస్థాన్ ఖాళీ చేయడం ఒక్కటే ఇక పరిష్కారం కావాల్సిన ప్రధాన అంశమని జైశ్వాల్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంపై భారత వైఖరి అత్యంత స్పష్టంగా ఉందని రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.
"ఈ విషయంలో మమ్మల్ని సంప్రదించిన ప్రపంచ దేశాలకు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాం. ఉగ్రవాదులను, వారి స్థావరాలను నిర్మూలించడమే భారత్ ప్రాథమిక లక్ష్యం. అందుకే ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ దుస్సాహసానికి పాల్పడింది. వారి చర్యలకు ప్రతిచర్యగానే భారత్ దాడులు చేయాల్సి వచ్చింది. పాకిస్థాన్ కాల్పులు నిలిపివేస్తే, భారత్ కూడా దాడులను ఆపేస్తుంది. ఈ సందేశాన్ని ప్రపంచ దేశాలకు స్పష్టంగా తెలియజేశాం. వారు కూడా పాకిస్థాన్‌కు ఈ విషయాన్ని చేరవేసి ఉంటారని భావిస్తున్నాం. అయినప్పటికీ, పాకిస్థాన్ భారత సూచనలను పెడచెవిన పెట్టింది" అని జైశ్వాల్ వివరించారు.