మన ఖజానా పెరగాలి: అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

  • రాష్ట్ర ఆదాయానికి సీఎం చంద్రబాబు వ్యూహం
  • లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు స్పష్టీకరణ
  • పన్ను ఎగవేతలకు టెక్నాలజీతో చెక్!
  • ఎర్రచందనం విక్రయంపై ప్రత్యేక కమిటీ
రాష్ట్ర ఆర్థిక వనరులను గణనీయంగా పెంచేందుకు పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేడు సచివాలయంలో ఆదాయార్జన శాఖలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, గత మూడు దశాబ్దాల ఆదాయ సరళిని లోతుగా అధ్యయనం చేసి, భవిష్యత్తుకు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,34,208 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించినట్లు సీఎం తెలిపారు.

పన్ను ఎగవేతలను సమర్థవంతంగా అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధను (ఏఐ) వినియోగించుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని శాఖల సమాచారంతో 'డేటా లేక్' ఏర్పాటు చేయాలని, ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. దీని ద్వారా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, ఎగవేతలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. బంగారం కొనుగోళ్లలో రాష్ట్రం ముందున్నప్పటికీ, పన్నుల రూపంలో ఆశించిన ఆదాయం రాకపోవడంపై దృష్టి సారించాలని సూచించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం విక్రయాలకు, దాని విలువ నిర్ధారణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వేల కోట్ల విలువైన ఎర్రచందనం రాష్ట్రానికి ఒక వరం లాంటిదని, దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చుకోవచ్చని అన్నారు. కమిటీ ద్వారా ఎర్రచందనం నిల్వలు, వాటి విలువపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను కఠినంగా నియంత్రించాలని, మద్యం సరఫరా నుంచి అమ్మకాల వరకు పూర్తి పారదర్శకత ఉండేలా రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ ఆదాయం ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉండటంపై దృష్టి సారించి, ఆదాయ మార్గాలను అన్వేషించాలని కోరారు. నూతన ఎక్సైజ్ విధానం సత్ఫలితాలనిస్తున్నా, మరింత మెరుగుపడాలన్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) మే 11 నాటికి కేంద్రం నుంచి రూ.12,717 కోట్లు మాత్రమే వచ్చాయని, ఇది గత ఏడాదితో పోలిస్తే 26 శాతం తక్కువని అధికారులు సీఎంకు వివరించారు. ఆదాయార్జన శాఖలన్నీ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి, రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.


More Telugu News