Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియో వినియోగదారులకు ఊహించని షాక్..!

- ప్రైమ్ వీడియో కంటెంట్‌పై ప్రకటనలు తీసుకువస్తున్నట్లు అమెజాన్ వెల్లడి
- జూన్ 17 నుంచి సినిమాలు, టీవీ షోల మధ్యలో యాడ్స్ ప్రసారం
- ప్రకటనలు చూడటానికి ఇష్టపడని వినియోగదారుల కోసం ప్రత్యేకమైన యాడ్-ఫ్రీ ప్లాన్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారత్‌లోని తన వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రైమ్ వీడియో కంటెంట్‌పై ప్రకటనలు తీసుకువస్తున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 17వ తేదీ నుంచి అమెజాన్‌లో ప్రసారమయ్యే సినిమాలు, టీవీ షోల మధ్యలో యాడ్స్‌ను ప్రసారం చేయనున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కంటెంట్‌పై మరింత పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ప్రకటనలు చూడటానికి ఇష్టపడని వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన యాడ్-ఫ్రీ ప్లాన్‌ను కూడా అమెజాన్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాడ్-ఫ్రీ ప్లాన్ కోసం వినియోగదారులు అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ప్రకటనలు లేకుండా చూడాలనుకునేవారు అదనపు రుసుముతో కొత్త ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్లాన్ నెలవారీగా రూ. 129 లేదా ఏడాదికి రూ. 699గా ఉంటుందని అమెజాన్ వెల్లడించింది. ఇది యాడ్-ఆన్ ప్లాన్... రూ.1,499 ఖరీదు చేసే ప్రస్తుత అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వంపైన ఈ యాడ్ ఆన్ ప్లాన్ ను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, ప్రస్తుతం ఈ కొత్త ప్లాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా అందుబాటులో రాలేదు.
ఈ మేరకు అమెజాన్ తన వినియోగదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం ప్రారంభించింది. "ఇది మేము ఆకర్షణీయమైన కంటెంట్‌లో పెట్టుబడి పెట్టడం కొనసాగించడానికి, ఆ పెట్టుబడిని ఎక్కువ కాలం పాటు పెంచుకోవడానికి అనుమతిస్తుంది. టీవీ ఛానెళ్లు, ఇతర స్ట్రీమింగ్ సేవల కంటే అర్థవంతంగా తక్కువ ప్రకటనలను కలిగి ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం" అని సందేశాలు పంపుతోంది.