India Meteorological Department: ఈసారి ముందే... అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు

Early Arrival of Southwest Monsoon in Andaman and Nicobar Islands

  • వేసవి నుంచి ఉపశమనం... వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
  • దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల వద్ద విస్తరించిన రుతుపవనాలు
  • మే 27 నాటికి కేరళను తాకే అవకాశం

తీవ్రమైన వేసవి తాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి శుభవార్త అందించింది. దేశ వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ, అంచనాల కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. మంగళవారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది.

రుతుపవనాల ప్రభావంతో నికోబార్ దీవుల్లో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇవి మరింతగా విస్తరించి, అండమాన్ నికోబార్ దీవుల మొత్తంతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు చేరుకుంటాయని, ఇందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ నెల 27వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇదివరకే అంచనా వేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళలోకి ప్రవేశించే నైరుతి, ఈసారి సుమారు నాలుగు రోజుల ముందే రానుండటం గమనార్హం. ఇది సాకారమైతే, 2009 తర్వాత రుతుపవనాలు ఇంత ముందుగా రావడం ఇదే ప్రథమం అవుతుంది. 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 

ఇక, ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుండటం ఊరటనిచ్చే అంశం.

భారతదేశంలో దాదాపు 52 శాతం సాగుభూమి వర్షాధారంగానే ఉంది. దేశ వ్యవసాయ ఉత్పత్తిలో 40 శాతం ఈ భూముల నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో, దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి నైరుతి రుతుపవనాలే ఆధారం. అంతేకాకుండా, దేశంలోని జలాశయాలు నిండటానికి, తాగునీటి అవసరాలు తీర్చడానికి, విద్యుదుత్పత్తికి, తద్వారా దేశ జీడీపీ వృద్ధికి నైరుతి వర్షాలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి.

India Meteorological Department
IMD
Southwest Monsoon
Andaman and Nicobar Islands
Kerala
Monsoon arrival
Premature Monsoon
Rainfall
Agriculture
Indian Economy
  • Loading...

More Telugu News