Padi Kaushik Reddy: 'రోహిత్ శర్మను అవుట్ చేసిన పాడి కౌశిక్ రెడ్డి'... ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఇదిగో!

- ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోని చురుకైన నేతల్లో పాడి కౌశిక్ రెడ్డి ఒకరు
- హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి
- గతంలో హైదరాబాద్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన వైనం
బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో రంజీ క్రికెటర్ అని తెలిసిందే. ఒకప్పుడు క్రికెటర్‌గా రాణించిన ఆయన, తన పాత మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా, ప్రస్తుత భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను తాను ఔట్ చేసిన ఓ అపురూప క్షణాన్ని ఆయన ప్రస్తావించారు.
రాజకీయాల్లోకి ప్రవేశించకముందు కౌశిక్ రెడ్డి క్రికెట్‌లో చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల కొన్ని పాత వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు చూసినప్పుడు ఆనాటి జ్ఞాపకాలు తన మదిలో మెదిలాయని తాజాగా ట్వీట్ ద్వారా తెలిపారు. "క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇటీవల పాత వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు చూస్తుంటే హైదరాబాద్-ముంబయి జట్ల మ్యాచ్ నాటి మధుర స్మృతులు గుర్తుకొచ్చాయి. ముఖ్యంగా ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసిన క్షణం నా మదిలో మెదిలింది. అలాంటి క్షణాలు నిజంగా అపురూపమైనవి" అని కౌశిక్ రెడ్డి తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు.
ఆ మధురానుభూతులను గుర్తుచేసుకుంటున్నప్పుడు, ముంబై జట్టుపై హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో తాను పోషించిన కీలక పాత్ర కూడా గుర్తుకొచ్చిందని ఆయన వివరించారు. ఆనాటి క్రికెట్ అనుభవాలు, విజయాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని, ఈ జ్ఞాపకాలు తనకు బంగారు క్షణాలని కౌశిక్ రెడ్డి తన పోస్టులో తెలిపారు.
పాడి కౌశిక్ రెడ్డి ప్రధానంగా ఫాస్ట్ బౌలర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 15 మ్యాచ్ లు ఆడి 47 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో 299 పరుగులు చేశాడు. అందులో ఓ ఫిఫ్టీ కూడా ఉంది.