బృందావ‌నంలో విరాట్ కోహ్లీ దంప‌తులు.. వీడియో వైర‌ల్‌!

  • మంగ‌ళ‌వారం యూపీలోని బృందావన్ ధామ్‌కు వెళ్లిన కోహ్లీ క‌పుల్‌
  • ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్న జంట‌
  • ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌
టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఒక రోజు తర్వాత భారత స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్ కోహ్లీ మంగళవారం తన భార్య అనుష్క శర్మతో కలిసి యూపీలోని బృందావన్ చేరుకున్నాడు. ఈ జంట ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్‌ను బృందావన్ ధామ్‌లో కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా సెల‌బ్రిటీ క‌పుల్‌కు ఆయ‌న ఆధ్యాత్మిక బోధ‌న‌లు చేశారు. గ‌తంలో కూడా కోహ్లీ దంప‌తులు త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి బృందావనానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. దేశంలోని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువుల‌లో ప్రేమానంద్ ఒక‌రు.  

ఇక‌, కోహ్లీ తన 14 ఏళ్ల‌ అద్భుతమైన టెస్ట్‌ కెరీర్‌కు సోమ‌వారం ముగింపు పలికాడు. తన టెస్ట్ కెరీర్‌లో టీమిండియా త‌ర‌ఫున‌ 123 మ్యాచ్‌లు ఆడాడు. 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు 254 (నాటౌట్‌). సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122 పరుగులు) తర్వాత ఈ లాంగ్‌ ఫార్మాట్‌లో భారత్ త‌ర‌ఫున‌ అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడు కోహ్లీనే.

2011 జూన్ లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో కోహ్లీ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తన తొలి టెస్ట్ పర్యటనలో ఐదు ఇన్నింగ్స్‌లలో క‌లిపి కేవలం 76 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అయినప్పటికీ ఆ త‌ర్వాత‌ విరాట్ టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్‌గా ఎదిగాడు. ప్రత్యేక బ్యాటింగ్ స్టైల్‌తో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు.


More Telugu News