రెండు రోజుల్లో బాంబు పేలుళ్లు.. ముంబ‌యి పోలీసుల‌కు బెదిరింపులు

  
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ దేశంలో బాంబు బెదిరింపులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు క్రికెట్‌ స్టేడియాలకు, విమానాలకు, విమానాశ్ర‌యాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, అవ‌న్నీ బూట‌క‌మ‌ని అధికారులు తేల్చారు. ఇప్పుడు ముంబ‌యి పోలీసుల‌కు బాంబు బెదిరింపు మెయిల్ వ‌చ్చింది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి నగరంలో రెండు రోజుల్లో భారీ పేలుళ్లు జరుగుతాయని ఆగంత‌కులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ముంబ‌యి పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు మెయిల్‌ పంపారు. ఈ బెదిరింపుల‌ను తేలికగా తీసుకోవద్దని కూడా హెచ్చరించారు. 

ఇక‌, ఈ బెదిరింపులతో అప్రమత్తమైన అధికారులు ఈ మెయిల్‌ను ఎవ‌రు పంపారనే విష‌యంపై ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్‌ ద్వారా మెయిల్‌ పంపిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే భ‌ద్ర‌తాప‌ర‌మైన చ‌ర్య‌లు కూడా చేపట్టారు. 


More Telugu News