Air Marshal AK Bharti: ఏంటీ కిరానా హిల్స్.. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత దానిపై ఎందుకు చర్చ?

Kirana Hills Operation Sindhu Aftermath Sparks Debate
  • పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న కిరానా హిల్స్
  • ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దానిపై దాడిచేసినట్టు వార్తలు
  • ఖండించిన భారత ఎయిర్ మార్షల్ ఏకే భారతి
  • సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి
  • కిరానా హిల్స్‌ను అణ్వాయుధాలు నిల్వచేసేందుకు పాక్ ఉపయోగించుకుంటోందని ప్రచారం
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఈ నెల 7న భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కిరానా హిల్స్‌పై భారత సైన్యం దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను భారత వాయుసేన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి సోమవారం తీవ్రంగా ఖండించారు. ‘ఆపరేషన్ సిందూర్‌’పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు.

‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధ జిల్లాలో ఉన్న కిరానా హిల్స్ ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పేర్కొంటూ పలు ఎక్స్ ఖాతాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వైమానిక స్థావరాలతో పాటు కిరానా హిల్స్‌పైనా భారత్ దాడి చేసిందా? అని ఎయిర్ మార్షల్ భారతిని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ "కిరానా హిల్స్‌లో కొన్ని అణు వ్యవస్థాపనలు ఉన్నాయని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. మాకు ఆ విషయం తెలియదు" అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  

కిరానా హిల్స్ ప్రాముఖ్యత
పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్ ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కీలక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ కొండల్లోని గుహలను పాకిస్థాన్ సైన్యం తమ అణ్వాయుధాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తోందని భావిస్తున్నారు. "ఇస్లామాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉన్న ఖుషాబ్‌లో ఆయుధాల తయారీకి అవసరమైన ప్లూటోనియం ఉత్పత్తి కోసం నాలుగు భారీ రియాక్టర్లు ఉన్నాయి" అని వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ఫిబ్రవరి 2025 నాటి నివేదికలో పేర్కొంది. కిరానా హిల్స్ అనేది భూగర్భ అణు మౌలిక సదుపాయాలకు పేరుగాంచిన అత్యంత పటిష్టమైన సైనిక జోన్ అని కల్నల్ వినాయక్ భట్ (రిటైర్డ్) నవంబర్ 2017లో 'ది ప్రింట్' కోసం రాసిన కథనంలో వివరించారు.

శాటిలైట్ చిత్రాల ప్రకారం సర్గోధలోని ముషఫ్ వైమానిక స్థావరం రన్‌వేపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఈ వైమానిక స్థావరానికి, కిరానా హిల్స్‌కు మధ్య దూరం 19.9 కిలోమీటర్లు. అయితే, భారత వాయుసేన మాత్రం కిరానా హిల్స్‌ను లక్ష్యంగా చేసుకోలేదని అధికారికంగా ధ్రువీకరించింది.
Air Marshal AK Bharti
Operation Sindhu
Kirana Hills
Pakistan
Nuclear Facilities
Pakistan Air Force
Surgical Strike
India-Pakistan Conflict
Military Zone
Sargodha

More Telugu News