Ramiz Khan: పాక్ షెల్లింగ్‌లో కవలల మృతి.. ప్రాణాలతో పోరాడుతున్న తండ్రి

- పాక్ మోర్టార్ దాడిలో 12 ఏళ్ల కవలల మృతి
- తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి
- దాడిలో అత్త, మామలు కూడా మృతి
- పిల్లలకు మెరుగైన విద్య కోసం రెండు నెలల క్రితమే పూంఛ్‌కు కుటుంబం వలస
జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాక్ షెల్లింగ్‌లో 12 ఏళ్ల వయసున్న కవల సోదరులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారి తండ్రి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జోయా ఖాన్, అయాన్ ఖాన్ అనే కవలలు గత నెలలోనే తమ 12వ జన్మదినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ నెల 7న పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో భాగంగా దూసుకొచ్చిన మోర్టార్ షెల్ తమ అద్దె ఇంటిపై పడటంతో నిమిషాల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. ఈ దాడిలో చిన్నారుల అత్త, మామ కూడా ప్రాణాలు విడిచారు. పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు రెండు నెలల క్రితమే ఈ కుటుంబం పూంఛ్‌కు వలస వచ్చినట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన చిన్నారుల తండ్రి రమీజ్ ఖాన్ (48) ప్రస్తుతం జమ్మూలోని ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయన కాలేయం దెబ్బతిన్నట్టు వైద్యులు తెలిపారు. రమీజ్ ఖాన్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకూడదన్న ఉద్దేశంతో పిల్లల మరణవార్త ఆయనకు తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. కన్నబిడ్డలను కోల్పోయిన దుఃఖం ఒకవైపు, భర్త ప్రాణాలతో పోరాడుతుండటం మరోవైపు.. ఈ రెండింటి మధ్య తల్లి ఉర్షా ఖాన్ మానసికంగా కుంగిపోయారని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు.