Telangana Cyber Police: గుజరాత్‌లో తెలంగాణ సైబర్ పోలీసుల ఆపరేషన్!

Telangana Cyber Police Busts Gujarat Cyber Crime Ring
  • సూరత్‌లో 20 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
  • తెలంగాణలో 60, దేశవ్యాప్తంగా 515 కేసుల్లో నిందితులు
  • నిందితుల నుంచి మొబైల్స్, సిమ్‌లు, ఏటీఎం కార్డులు స్వాధీనం
సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. గుజరాత్‌లోని సూరత్‌లో మకాం వేసి మోసాలకు పాల్పడుతున్న 20 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో వీరంతా నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన నిందితులను సూరత్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అనేక మందిని మోసం చేస్తున్న సైబర్ ముఠాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో పలు కేసుల్లో నిందితుల జాడ గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెండు ప్రత్యేక బృందాలను సూరత్‌కు పంపించారు. అక్కడ సుమారు పది రోజుల పాటు రహస్యంగా ఆపరేషన్ నిర్వహించి, కీలక సమాచారం సేకరించి 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన వారిలో ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వ్యాపారులు, డీసీబీ బ్యాంకుకు చెందిన వాపి బ్రాంచ్ రిలేషన్‌షిప్ మేనేజర్ కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరంతా పెట్టుబడుల పేరుతో ఆశ చూపడం, పార్ట్ టైం ఉద్యోగాల ఎర వేయడం వంటి పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు. ఈ ముఠా సభ్యులపై కేవలం తెలంగాణలోనే సుమారు 60 కేసులు నమోదై ఉండగా, దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 515కు పైగా కేసులు ఉన్నట్లు వెల్లడైంది.

నిందితుల నుంచి 20 మొబైల్ ఫోన్లు, 28 సిమ్‌కార్డులు, 4 ఏటీఎం కార్డులు, 5 చెక్కు పుస్తకాలు, 2 రబ్బరు స్టాంపులతో పాటు నేరాలకు ఉపయోగించిన ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కార్యకలాపాలు, బాధితుల సంఖ్యపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Telangana Cyber Police
Gujarat Cyber Crime
Surat Cyber Crime Bust
Cyber Security Bureau
Online Fraud
Investment Scam
Part-time Job Scam
DCB Bank
Cyber Crime Investigation
Telangana Police

More Telugu News