Anushka Sharma: కోహ్లీ రిటైర్మెంట్... అర్ధాంగి అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా రన్ మెషీన్ ఇలా లాంగ్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి ఒక విధంగా క్రికెట్ లవర్స్‌కు షాకిచ్చాడు. దీంతో అతని రిటైర్మెంట్‌పై మాజీ, వర్తమాన క్రికెటర్లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
తాజాగా కోహ్లీ అర్ధాంగి, నటి అనుష్క శర్మ ఇన్‌స్టా వేదికగా స్పందించారు. భర్త టెస్టుల నుంచి వైదొలగడంపై ఆమె ఎమోషనల్ పోస్టు పెట్టారు. "అందరూ నీ రికార్డులు, మైలురాళ్ల గురించి మాట్లాడుకుంటారు. కానీ నువ్వు ఎప్పుడూ ఎవరికీ చూపించని కన్నీళ్లు, ఎవరూ చూడని పోరాటాలు, ఈ ఫార్మాట్‌పై నువ్వు చూపిన అచంచలమైన ప్రేమ నాకు గుర్తుండిపోతాయి. ప్రతి టెస్ట్ సిరీస్ తర్వాత నువ్వు కొంచెం వివేకవంతుడిగా, కొంచెం వినయంగా తిరిగి వచ్చావు. ఈ ఫార్మాట్‌లో నువ్వు అభివృద్ధి చెందడాన్ని చూడటం చాలా ప్రత్యేకం.
ఏదో ఒకరోజు నువ్వు వైట్ డ్రెస్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతావని ఊహించా. కానీ నువ్వు ఎల్లప్పుడూ నీ హృదయాన్ని అనుసరించావు. అందుకే నా ప్రేమను చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అద్భుతమైన వీడ్కోలును పొందావు" అని అనుష్క శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.