Operation Sindoor: పాకిస్థాన్‌పై భార‌త్ దాడి.. వీడియో విడుద‌ల చేసిన ఆర్మీ

Indias Air Strike on Pakistan Army Releases Video

  • పాక్‌పై దాడి వీడియోను ప్రెస్‌మీట్ సంద‌ర్భంగా మీడియాకు చూపించిన త్రివిధ ద‌ళాధిప‌తులు 
  • ఇండియ‌న్ నేవీ, ఆర్మీ, వాయుసేన త‌మ లక్ష్యాల‌ను ఛేదించాయ‌న్న‌ అధికారులు
  • తాజాగా భారత సైన్యం విడుద‌ల చేసిన వీడియోలో పాక్ యుద్ధ విమానం మిరాజ్ శిథిలాలు

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌పై దాడి వీడియోను ప్రెస్‌మీట్ సంద‌ర్భంగా భారత సైన్యం  మీడియాకు చూపించింది. ఇండియ‌న్ నేవీ, ఆర్మీ, వాయుసేన త‌మ లక్ష్యాల‌ను ఛేదించాయ‌ని అధికారులు పేర్కొన్నారు. ఇక‌, ఆప‌రేష‌న్‌ సమయంలో పాకిస్థాన్ మిరాజ్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు భారత్‌ ఈరోజు ధృవీకరించింది. తాజాగా భారత సైన్యం విడుద‌ల చేసిన వీడియోలో పాకిస్థాన్ మిరాజ్ శిథిలాలను మ‌నం చూడవచ్చు. 

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మందిని బలిగొన్న పాశవిక‌ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ గురించి ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి విలేకరుల సమావేశంలో భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళానికి చెందిన సీనియర్ కమాండర్లు సమగ్ర వివరాలను పంచుకున్నారు. 

ఈ బ్రీఫింగ్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ వైస్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ వైస్ అడ్మిరల్ ఏఎన్‌ ప్రమోద్ సంయుక్తంగా నాయకత్వం వహించారు.

స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ, ఆకాశ్ వ్యవస్థ యొక్క అద్భుతమైన పనితీరు ఆప‌రేష‌న్ సిందూర్ స‌క్సెస్ కావ‌డంలో కీరోల్ పోషించింద‌ని ఈ సంద‌ర్భంగా ఎయిర్ వైస్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. అలాగే గత దశాబ్దం కాలంగా భారత ప్రభుత్వం నుంచి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు అందుతున్న‌ బడ్జెట్, విధానప‌ర‌మైన‌ మద్దతు కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంద‌ని ఆయ‌న అన్నారు. 

ఇక‌, ఆపరేషన్ సిందూర్ దాదాపు 25 నిమిషాలు కొనసాగిందని, మే 7 తెల్లవారుజామున ప్రారంభ‌మైంద‌న్నారు. ఇందులో తొమ్మిది ధృవీకరించబడిన ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయ‌ని తెలిపారు. వాటిలో నాలుగు పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో ఉంటే... ఐదు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉన్నాయ‌న్నారు. 

లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు సంబంధించిన ప‌లు స్థావరాలను ధ్వంసం చేసిన‌ట్లు ఎయిర్ వైస్ మార్షల్ ఏకే భారతి పేర్కొన్నారు. కాగా, ఈ ఆపరేషన్ ద్వారా 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన‌ట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.  

Operation Sindoor
Indian Army
Pakistan
Air Strike
Mirage Jet
Rajnath Singh
Counter Terrorism
India Pakistan Conflict
Jammu and Kashmir
  • Loading...

More Telugu News