Narendra Modi: ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీ ఈ ఐదు లక్ష్యాలను నిర్దేశించారు: సంబిత్ పాత్రా

PM Modis 5 Goals Behind Operation Sindhu BJP Leader Reveals Details
  • ఆపరేషన్ సిందూర్‌ ఘన విజయం సాధించిందన్న సంబిత్ పాత్రా
  • పాక్‌కు భారత్ గట్టి జవాబు ఇచ్చిందన్న బీజేపీ నేత
  • మోదీ వ్యూహం అమోఘమని ప్రశంస
  • ఉగ్ర స్థావరాలపై దాడులు విజయవంతమయ్యాయని వెల్లడి
  • అణ్వస్త్ర దేశంలోకి వెళ్లి దాడి చేయడం ఇదే ప్రథమమని వ్యాఖ్య
పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌' వందకు వంద శాతం విజయవంతమైందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఉద్ఘాటించారు. ఈ ఆపరేషన్‌‍కు సంబంధించి మోదీ ఐదు లక్ష్యాలను నిర్దేశించారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండటంతో సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఆపరేషన్ సిందూర్‌' ద్వారా భారత సైన్యం అద్భుతమైన విజయాన్ని అందుకుందని సంబిత్ పాత్రా పేర్కొన్నారు. 'మన సైన్యం నూరు శాతం విజయం సాధించింది. అది కూడా అత్యంత నియంత్రిత, కచ్చితమైన వ్యూహాత్మక చర్యల ద్వారానే. పాకిస్థాన్‌లోని కీలకమైన ప్రాంతాలను మన సైనిక దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి' అని ఆయన వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రతీకారం తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ రచించే వ్యూహాలు శత్రుదేశాల ఊహకు కూడా అందవని ఆయన కొనియాడారు.

ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం తమ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిందని సంబిత్ పాత్రా అన్నారు. "ఇది అద్భుతమైన విజయం. పాకిస్థాన్ భూభాగంలోకి చాలా దూరం చొచ్చుకెళ్లి, శత్రు దేశంలోని ఉగ్రవాద శిబిరాలను మన సైన్యం విజయవంతంగా నిర్మూలించింది. ఇది నయా భారత్ పరాక్రమం. ఒక అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం భూభాగంలోకి ఇంత లోతుగా వెళ్లి దాడి చేయడం చరిత్రలో ఇదే తొలిసారి" అని ఆయన స్పష్టం చేశారు.

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ప్రధాని మోదీ ఐదు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించారని సంబిత్ పాత్రా తెలిపారు. మొదటిది... శత్రు భూభాగంలోకి సుదూరంగా ప్రవేశించి దాడులు చేయడం... రెండోది, ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయడం... మూడోది, వాటిని సమూలంగా నిర్మూలించడం... నాలుగోది, ఈ మొత్తం ప్రక్రియలో సాధారణ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా చూడటం... ఐదవది, శత్రుదేశ సైనిక మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు చేయకుండా ఉండటం అని ఆయన వివరించారు. ఈ లక్ష్యాలన్నింటినీ భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందని, అజేయమైన శక్తిపాటవాలను ప్రదర్శిస్తూ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిందని ఆయన ప్రశంసించారు.
Narendra Modi
Operation Sindhu
Indian Army
Pakistan
Surgical Strike
Terrorist Camps
National Security
BJP
Sambit Patra

More Telugu News