Rohit Sharma: టీ20లకు రిటైర్మెంట్ వెనకున్న షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రోహిత్‌శర్మ

- టీ20 ప్రపంచకప్ గెలిపించిన తర్వాత టీ20లకు వీడ్కోలు
- గెలవకున్నా రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నానన్న రోహిత్
- ఇప్పుడు టెస్టుల నుంచి కూడా వైదొలగిన స్టార్ బ్యాటర్
2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును విజయపథంలో నడిపించి, ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు 17 ఏళ్ల తర్వాత తెరదించిన ఘనత రోహిత్ శర్మదే. దక్షిణాఫ్రికాతో ఉత్కంఠగా జరిగిన ఫైనల్ పోరులో భారత్ విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించగా, మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ మరుసటి రోజే రవీంద్ర జడేజా సైతం టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
టీ20 ప్రపంచకప్ గెలిచిన దాదాపు ఏడాది తర్వాత ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రోహిత్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఒకవేళ భారత్ టీ20 ప్రపంచకప్ గెలవకపోయినా తాను రిటైర్మెంట్ ప్రకటించి ఉండేవాడినని రోహిత్ చెప్పాడు. "టీ 20 ప్రపంచకప్ గెలవకపోయినా నేను రిటైర్మెంట్ ప్రకటించేవాడినే.. అయితే, కప్ గెలిచాక పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. టోర్నీలో మంచి ప్రదర్శన చేశాం, మనలో ఇంకా సత్తా ఉంది కాబట్టి ఇంకొంత కాలం ఎందుకు కొనసాగకూడదని అనిపిస్తుంది. కానీ టీ20 లలో ఇంకా కొనసాగడం నాకు సరికాదు. ఎందుకంటే యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
‘‘మెరుగైన ప్రదర్శన చేసినపుడు ఇంకొంత కాలం ఎందుకు ఆడకూడదనే ప్రశ్న సహజం. ఎందుకంటే ఈ స్థానమేమీ అంత సులభంగా రాలేదు. దీని వెనక ఎంతో కష్టముంది, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. వాటన్నింటిపై నాకు అవగాహన ఉంది. ఇంత కష్టపడి సాధించిన స్థానాన్ని వదులుకోవడం కూడా కష్టమే, అందులోనూ మంచి ప్రదర్శన చేస్తున్నపుడు తప్పుకోవడం అంత సులభం కాదు’’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
భవిష్యత్ ప్రణాళికలు.. నాయకత్వ బాధ్యతలు
ప్రస్తుతం 38 ఏళ్ల రోహిత్ శర్మ, టెస్టుల నుంచి తప్పుకున్నప్పటికీ, వన్డే జట్టుకు తన సేవలు కొనసాగించనున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయన భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్ సారథ్యంలోనే భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అలాగే, 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు దూసుకెళ్లినప్పటికీ, ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగడంతో, భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించాల్సిన బాధ్యత ఇప్పుడు సెలక్షన్ కమిటీపై పడింది. రాబోయే రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.