Chandrababu: తారక రామారావుకు ఆల్ ది బెస్ట్: సీఎం చంద్రబాబు

- జానకీరామ్ కుమారుడు తారక రామారావు, వైవీఎస్ చౌదరి కాంబోలో సినిమా
- ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మూవీ
- ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎన్‌టీఆర్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
నందమూరి హరికృష్ణ మనవడు, జానకీరామ్ కుమారుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తారక రామారావుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఎన్‌టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. "తారక రామారావు ఇండస్ట్రీలో అడుగుపెడుతోన్న సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్‌టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను" అని సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
హీరో తారక రామారావు మాట్లాడుతూ... "మా ముత్తాత ఎన్‌టీఆర్, మా తాత హరికృష్ణ, మా నాన్న జానకీరామ్ ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉంటాయని నమ్ముతున్నాను. ఈ రోజు నా కుటుంబసభ్యులందరూ నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటినుంచి మీడియా ఎంతో సహకరించింది. వారందరికీ కృతజ్ఞతలు" అని అన్నారు.
కాగా, మూవీ ప్రారంభత్సవ కార్యక్రమానికి నారా భువనేశ్వరి, దుగ్గబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి హాజరయ్యారు. నారా భువనేశ్వరి హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి అభినందించారు. తన తండ్రి సీనియర్ ఎన్‌టీఆర్ నటనలో ఎంత కీర్తి తెచ్చుకున్నారో తారక రామారావు కూడా అలానే ఎదగాలని ఆకాంక్షించారు.