Mawra Hocane: సన్ తేరీ కసమ్ సీక్వెల్ నుంచి పాక్ నటి తొలగింపు

- సన్ తేరీ కసమ్ సీక్వెల్ నుంచి పాక్ నటి తొలగింపు
- పాకిస్థాన్ నటి మావ్రా హోకేన్ కు షాక్ ఇచ్చిన సినీ నిర్మాణ సంస్థ
- ఆపరేషన్ సిందూర్ పై వ్యతిరేక కామెంట్స్ చేసిన మవ్రా హోకేన్
- భారతీయ సినిమాల్లో నటించి, ఎంతో ప్రేమ, అభిమానం పొందిన వారు ఉగ్రదాడిని ఖండించకపోవడం బాధాకరమని వెల్లడి
ఆపరేషన్ సింధూర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు పాకిస్థాన్ నటి మావ్రా హోకేన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను సూపర్ హిట్ మూవీ 'సనమ్ తేరీ కసమ్' సీక్వెల్ నుంచి నిర్మాణ సంస్థ తొలగించింది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు రాధికా రావు, వినయ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. దేశమే అన్నింటికంటే ముఖ్యమని వారు స్పష్టం చేశారు. ఏ రకమైన ఉగ్రదాడినైనా ఖండించాల్సిందేనని అన్నారు.
భారతీయ సినిమాల్లో నటించి, ఎంతో ప్రేమ, అభిమానం పొందిన వారు ఉగ్రదాడిని ఖండించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్ తీసుకున్న నిర్ణయాలను కొందరు విమర్శించే స్థాయికి వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. తాము ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని, జై హింద్ అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సీక్వెల్‌లో మావ్రా ఉంటే తాను నటించడానికి సిద్ధంగా లేనని హీరో హర్షవర్థన్ రాణే ఇదివరకే ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను సీక్వెల్ నుంచి తొలగిస్తూ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకుంది.
'సనమ్ తేరీ కసమ్' మూవీ 2016లో విడుదలై, మొదట రూ.16 కోట్లు వసూలు చేసింది. ఇటీవల రీ-రిలీజ్‌లో రూ.41 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. దీంతో 'సనమ్ తేరీ కసమ్ 2' (సీక్వెల్)ను నిర్మాణ సంస్థ చేపట్టడానికి నిర్ణయించింది.