తన లీగల్ టీమ్ సాయంతో సుదీర్ఘ నిషేధం నుంచి తప్పించుకున్న రబాడా!

  • SA20లో రబాడా కొకైన్ వాడినట్టు నిర్ధారణ
  • SAIDS క్లియరెన్స్, మళ్లీ ఆటకు సిద్ధం
  • ఇటీవలే నిషేధం పూర్తి
  • తెలివిగా వాదనలు వినిపించిన రబాడా లీగల్ టీమ్ 
దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా డోపింగ్ వివాదంలో చిక్కుకున్నప్పటికీ, స్వల్పకాలిక నిషేధం అనంతరం తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు మార్గం సుగమమైంది. SA20 టోర్నమెంట్ సందర్భంగా అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినప్పటికీ, అది పోటీయేతర సమయంలో జరిగినట్లు న్యాయవాదుల బృందం వాదించడంతో శిక్ష తగ్గింది. రబాడా తన చర్యకు పశ్చాత్తాపం వ్యక్తం చేయగా, అవగాహన కార్యక్రమం పూర్తి చేసినట్లు దక్షిణాఫ్రికా డ్రగ్-ఫ్రీ స్పోర్ట్ సంస్థ (SAIDS) ధృవీకరించింది.

ఈ ఏడాది జనవరిలో జరిగిన SA20 లీగ్ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షలో కగిసో రబాడా మూత్ర నమూనాలో కొకైన్ మెటబొలైట్ అయిన బెంజోయ్లెక్‌గోనైన్ ఆనవాళ్లు లభించినట్లు దక్షిణాఫ్రికా వార్తాపత్రిక 'రాపోర్ట్' వెల్లడించింది. అయితే, రబాడా న్యాయవాదుల బృందం ఈ విషయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. రబాడా శరీరంలో లభించిన బెంజోయ్లెక్‌గోనైన్ గాఢత (మిల్లీలీటర్‌కు 1,000 నానోగ్రాముల కంటే తక్కువ) తక్కువగా ఉందని, ఇది పరీక్ష జరిగిన రోజు కాకుండా, అంతకుముందు కొకైన్ వాడినట్లు సూచిస్తుందని వాదించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, అతని కొకైన్ వాడకం పోటీయేతర సమయంలో జరిగిందని నిర్ధారించి, శిక్షను తగ్గించారు.

డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో, 29 ఏళ్ల రబాడా గత నెలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. అతడిపై తాత్కాలిక నిషేధం విధించారు. "నా వల్ల నిరాశచెందిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నా జీవితంలో క్రికెట్ కే అత్యధిక ప్రాధాన్యత" అని రబాడ ఒక ప్రకటనలో తెలిపాడు. 

దక్షిణాఫ్రికా జట్టులో కీలక ఫాస్ట్ బౌలర్ అయిన రబాడ, 70 టెస్టుల్లో 327 వికెట్లు పడగొట్టాడు. జూన్ 11న లండన్‌లోని లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా విజయావకాశాల్లో ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్ పాత్ర కీలకం కానుంది. నిషేధం ముగిసిన నేపథ్యంలో, రబాడా ఈ కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.


More Telugu News