DGMO: భారత్-పాక్ చర్చలు తటస్థ వేదికలో కాదు... రేపు హాట్ లైన్ లో!

India and Pakistan DGMOs to Hold Key Talks via Hotline on May 12
  • మరోసారి భారత్-పాక్ డీజీఎంఓల కీలక చర్చలు
  • మే 12న హాట్ లైన్ లో చర్చించనున్న భారత్-పాక్ డీజీఎంఓలు
  • కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు ప్రధాన అజెండా
భారత్ మరియు పాకిస్థాన్ దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)ల మధ్య సోమవారం (మే 12) కీలక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమలు, తదనంతర పరిస్థితులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్‌లైన్ ద్వారా ఈ చర్చలు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత ఈ కీలక సమావేశం ఓ తటస్థ వేదికలో జరుగుతుందని భావించినప్పటికీ, హాట్ లైన్ ద్వారా నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు.

ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించడం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో డీజీఎంఓలు దృష్టి సారించనున్నారు. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు.

గత శనివారం మధ్యాహ్నం 3.35 గంటల సమయంలో పాకిస్థాన్ డీజీఎంఓ, భారత డీజీఎంఓతో హాట్‌లైన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తక్షణమే అమలులోకి తీసుకురావాలని పాకిస్థాన్ ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనికి భారత్ కూడా సానుకూలంగా స్పందించడంతో, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. అయితే, ఈ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా డీజీఎంఓల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
DGMO
India-Pakistan
Ceasefire Agreement
Military Talks
Hot Line
Border tensions
Vikram Misri
Indo-Pak relations
South Asia
International Relations

More Telugu News