Pakistan Army: పుల్వామా దాడిలో మా పాత్ర ఉంది.. పాకిస్థాన్ సైన్యం సంచలన ప్రకటన

Pakistan Admits Role in 2019 Pulwama Terrorist Attack

  • 2019 భారత పారా మిలటరీ సిబ్బందిపై ఉగ్రదాడి
  • 40 మంది భారత సైనికుల మృతి
  • దాడిలో తమ హస్తం లేదని ఇప్పటి వరకు పాక్ బుకాయింపు
  • ఇప్పుడు బహిరంగంగా అంగీకరించిన పీఏఎఫ్ ఎయిర్ వైస్  మార్షల్
  • పాక్ ద్వంద్వ వైఖరి మరోమారు బట్టబయలు

2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది భారత పారామిలటరీ సిబ్బంది మృతికి కారణమైన భీకర ఉగ్రదాడి వెనుక తమ సైన్యం హస్తం ఉందని పాకిస్థాన్ సైనిక ఉన్నతాధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల తరబడి బుకాయిస్తూ వచ్చిన పాకిస్థాన్ ఎట్టకేలకు అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఈ నిజాన్ని అంగీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

విలేకరుల సమావేశంలో పాకిస్థాన్ వైమానిక దళానికి (పీఏఎఫ్) చెందిన పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ.. పుల్వామాలో తమ వ్యూహాత్మక చాకచక్యాన్ని వారికి (భారత్ కు) చాటి చెప్పడానికి ప్రయత్నించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి, నౌకాదళ ప్రతినిధి కూడా పాల్గొన్నారు.

ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ గగనతలం, భూభాగం, జలాలు లేదా ప్రజలకు ముప్పు వాటిల్లితే రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దేశానికి తాము రుణపడి ఉన్నామని చెప్పారు. పాకిస్థానీ ప్రజలు తమ సాయుధ బలగాలపై ఉంచిన నమ్మకాన్ని తాము ఎల్లప్పుడూ, అన్ని పరిస్థితుల్లోనూ కాపాడతామని స్పష్టం చేశారు. పుల్వామాలో మా వ్యూహాత్మక చాకచక్యంతో దాన్ని తెలియజేయడానికి ప్రయత్నించామని, ఇప్పుడు, తమ కార్యాచరణ పురోగతిని, వ్యూహాత్మక చతురతను ప్రదర్శించామని పేర్కొన్నారు.  ఈ వ్యాఖ్యలు పుల్వామా దాడిలో పాక్ ప్రమేయాన్ని అంగీకరించడమే కాకుండా, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి విషయంలో కూడా పాకిస్థాన్ అనుసరిస్తున్న వైఖరిని చెప్పకనే చెబుతున్నాయి.

గతంలో పాక్ బుకాయింపులు 
పుల్వామా దాడి జరిగిన నాటి నుంచి పాకిస్థాన్ తమ ప్రమేయం లేదని వాదిస్తూ వచ్చింది. జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించినప్పటికీ, నాటి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. కానీ, తమ సైనిక ప్రమేయాన్ని తిరస్కరించారు. భారత్ అనేక ఆధారాలు సమర్పించినప్పటికీ పాకిస్థాన్ వాటిని తోసిపుచ్చుతూ వచ్చింది. దాడి చేసిన ఆత్మాహుతి దళ సభ్యుడు ఆదిల్ అహ్మద్ దార్‌ను జైషే మహ్మద్‌తో ముడిపెడుతూ భారత్ ఇచ్చిన నివేదికను కూడా పాక్ పట్టించుకోలేదు.

ఎన్నో సంవత్సరాలుగా దాచిపెడుతూ వచ్చిన నిజాన్ని పాకిస్థాన్ సైనిక అధికారి స్వయంగా, బహిరంగంగా కెమెరాల ముందు అంగీకరించడం ద్వారా పుల్వామా దాడి విషయంలో పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది. ఈ తాజా అంగీకారం ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Pakistan Army
Pulwama Attack
Pakistan's confession
Pulwama Terrorist Attack
India-Pakistan Relations
Aurangzeb Ahmad
Ahmed Sharif Chaudhary
Jaish-e-Mohammed
Imran Khan
South Asia Terrorism
  • Loading...

More Telugu News