Shubman Gill: భారత టెస్టు క్రికెట్‌లో యువరక్తం.. కెప్టెన్‌గా గిల్!

- వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ!
- బుమ్రా ఫిట్‌నెస్, రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో మారిన సమీకరణాలు
- యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు టెస్టు జట్టులో చోటు!
భారత టెస్టు క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. టెస్టు క్రికెట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడంతో ఇప్పుడా పగ్గాలు యువ ఆటగాడు శుభమన్‌గిల్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్ కావడం దాదాపు ఖాయమైంది. విదేశీ గడ్డపై నిలకడగా రాణిస్తున్న పంత్ వైస్ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో సెంచరీలు సాధించడంతో పాటు ఏడు సార్లు 90కి పైగా పరుగులు చేయడం అతని సామర్థ్యానికి నిదర్శనం. మరోవైపు, జస్ప్రీత్ బుమ్రా జట్టులో కీలక బౌలర్ అయినప్పటికీ, ఫిట్‌నెస్ సమస్యలు అతడిని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయకత్వ బృందం నుంచి అతడిని తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించినట్టు తెలిసింది. బుమ్రా కెప్టెన్ కానప్పుడు అతడికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంలో అర్థం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కావాలని భావిస్తున్నట్టు వచ్చిన వార్తలు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే, ఇంగ్లండ్ పర్యటనకు కోహ్లీనే కెప్టెన్‌గా నియమించి, గిల్‌కు మరికొంత సమయం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ తొలుత భావించినట్లు సమాచారం. రోహిత్ శర్మ కూడా టెస్టుల నుంచి తప్పుకోవడంతో కోహ్లీ అనుభవం జట్టుకు అవసరమని, రాబోయే ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడాలని అతడిని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. కోహ్లీ టెస్టు కెరీర్‌పై బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాలను పీటీఐ సంప్రదించినప్పటికీ వారి నుంచి స్పందన రాలేదు.
ఇంగ్లండ్ సిరీస్‌కు కోహ్లీని కెప్టెన్‌గా నియమించాలని సెలెక్టర్లు ఆలోచించిన మాట వాస్తవమేనని, దీనివల్ల గిల్‌కు నాయకత్వ బాధ్యతల్లో రాటుదేలడానికి సమయం దొరికేదని ఈ పరిణామాలను దగ్గరి నుంచి గమనిస్తున్న బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, అతడికి ఇంకా 25 ఏళ్లు మాత్రమేనని, అతడింకా అత్యుత్తమ ఫామ్‌ను అందుకోవాల్సి ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, బుమ్రా ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా అజిత్ అగార్కర్ కమిటీకి గిల్ సరైన ఎంపికగా కనిపిస్తున్నాడని వివరించాయి.
మరోవైపు, కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ రేసులో పరిగణించడం లేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే 33 ఏళ్లు దాటిన రాహుల్ ఆస్ట్రేలియాలో మెరుగ్గా రాణించినప్పటికీ, నిలకడలేమి అతనికి పెద్ద సమస్యగా మారింది. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో 50 మ్యాచ్‌లాడి 35 కంటే తక్కువ సగటు కలిగి ఉండటం నిరాశాజనకమే.
ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును మే మూడో వారం చివరిలో, ఇండియా-ఏ జట్టును వచ్చే వారం ఆరంభంలో ప్రకటించే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లలో తమిళనాడుకు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ సాయి సుదర్శన్‌కు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓపెనర్‌గా లేదా మూడో స్థానంలో అతడిని ఆడించే అవకాశం ఉంది.