Wang Yi: ఎలాంటి సమయంలోనైనా అండగా ఉంటాం: పాక్ ఉప ప్రధానికి ఫోన్ చేసిన చైనా విదేశాంగ మంత్రి

పాకిస్థాన్‌కు అండగా ఉంటామని చైనా ప్రకటించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి శనివారం సాయంత్రం పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో తమ దేశం సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారని విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

మారుతున్న ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా, తాజా పరిణామాలను పాక్ విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రికి వివరించారు.

దీనిపై స్పందించిన వాంగ్ యీ, క్లిష్ట పరిస్థితుల్లో కూడా పాకిస్థాన్ సంయమనాన్ని ప్రదర్శిస్తోందని, దాని బాధ్యతాయుతమైన వైఖరిని ప్రశంసిస్తున్నామని చెప్పినట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, "అన్ని సమయాల్లో వ్యూహాత్మక సహకార భాగస్వామిగా, విడదీయరాని మిత్రుడిగా ఉన్న చైనా... పాకిస్థాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత మరియు జాతీయ స్వాతంత్రాన్ని కాపాడటంలో పాకిస్థాన్‌కు దృఢంగా అండగా నిలుస్తుందని ఆయన (వాంగ్ యీ) పునరుద్ఘాటించారు" అని పేర్కొంది.
Wang Yi
Pakistan
China
Foreign Minister
Bilateral Relations
International Relations
China-Pakistan Relations

More Telugu News