Chandrababu Naidu: భారత్-పాక్ కాల్పుల విరమణపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!

Chandrababu Naidus Statement on India and Pakistan Ceasefire
  • రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో సర్వమత సమ్మేళనం
  • భారత్-పాక్ కాల్పుల విరమణను స్వాగతించిన సీఎం చంద్రబాబు
  • "దేశమే ప్రథమం" నినాదంతో సమైక్యంగా ఉండాలని పిలుపు
  • ఉగ్రవాదంపై పోరులో త్రివిధ దళాలకు సంపూర్ణ మద్దతు
  • దేశ సమగ్రత విషయంలో కేంద్రానికి అండగా ఉంటామని స్పష్టీకరణ
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం శుభపరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 'దేశమే ప్రథమం' అనే నినాదంతో ప్రతి ఒక్కరూ దేశాన్ని కాపాడుకోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు భారతీయులందరూ సంఘటితంగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన ఉద్ఘాటించారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను సవాలుగా మారిందని, ఇది దేశంలో అనిశ్చిత పరిస్థితులకు, ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో జరిగిన సర్వమత ప్రార్థనా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలపై ప్రసంగించారు.

శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు భారత్, పాకిస్థాన్ దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు చర్చించుకుని కాల్పుల విరమణకు నిర్ణయం తీసుకోవడం ఒక సానుకూల పరిణామమని చంద్రబాబు అన్నారు. ఈ ప్రతిపాదన తొలుత పాకిస్థాన్ నుంచి రావడం, దానికి భారత్ అంగీకరించడం గమనార్హమన్నారు. "మన దేశానికి యుద్ధం చేయాలనే ఉద్దేశం లేదు. కానీ ఉగ్రవాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది," అని ఆయన తెలిపారు. ఇరు దేశాల ప్రతినిధులు 12వ తేదీన పరిస్థితిని సమీక్షించుకుంటారని వెల్లడించారు. ఉద్రిక్తతల కారణంగా నష్టపోయిన వారందరికీ సంతాపం తెలుపుతూ ఒక తీర్మానం చేయాలని సూచించారు.

"దేశ సమగ్రత పరిరక్షణకు ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపూర్ణంగా అండగా ఉంటారు" అని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరులో త్రివిధ దళాలకు అందరూ మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఉగ్రవాదంపై మన దేశం చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ ఘటన అనంతరం సరిహద్దుల్లో ఐదారు రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మన త్రివిధ దళాలు వీరోచితంగా పోరాడాయని కొనియాడారు. ఈ పోరాటంలో కొందరు సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారని, వారిలో మన రాష్ట్రానికి చెందిన వీర సైనికుడు మురళీ నాయక్ కూడా ఉన్నారని గుర్తుచేశారు. 25 ఏళ్ల వయసులోనే దేశ రక్షణ కోసం, తన దేహంపై జాతీయ జెండా కప్పుకుని వీరమరణం పొందుతానని చెప్పి, పాకిస్థాన్‌తో జరిగిన పోరులో మురళీనాయక్ అసువులు బాశారని ఆయన త్యాగాన్ని స్మరించుకున్నారు.

ఇతర దేశాలను దెబ్బతీయాలనే ఆలోచన భారతదేశానికి లేదని, అయితే మన సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని ఎన్నటికీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. దేశంలోని ప్రతి కులం, ప్రాంతం, మతం దేశం కోసం పనిచేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, విభిన్న సిద్ధాంతాలు ఉండవచ్చని, కానీ రాష్ట్ర, దేశ భవిష్యత్తు దృష్ట్యా ఎప్పుడూ వెనుకంజ వేయలేదని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మత విద్వేషాలకు తావులేదని, అందుకే అన్ని మతాల ప్రతినిధులతో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, భారతదేశం చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజలు బాంబుల మోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని, విద్యార్థులు స్వస్థలాలకు తిరిగి వచ్చారని గుర్తుచేశారు.
Chandrababu Naidu
India-Pakistan ceasefire
Indo-Pak tensions
Pulwama attack aftermath
Terrorism
Nationalism
Andhra Pradesh
Abdul Nazeer
Murali Naik
Cross border firing

More Telugu News