ఆపరేషన్ సిందూర్‌లో హతమైన టాప్ ఫైవ్ టెర్రరిస్టులు వీరే!

  • మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులు మృతి
  • మృతుల్లో లష్కరే, జైషే ఉగ్రసంస్థలకు చెందిన ముఖ్య నేతలు
  • మే 7న పాక్, పీఓకేలోని 9 ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో పలువురు కీలక ఉగ్రవాదులు హతమయ్యారని భారత సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో మరణించిన ఐదుగురు టాప్ టెర్రరిస్టుల వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వీరిలో జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు బావమరుదులు కూడా ఉన్నారు.

మే 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్, పీఓకేలోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థల స్థావరాలపై భారత దళాలు మెరుపుదాడులు నిర్వహించాయి. ఈ ‘ఆపరేషన్ సిందూర్‌’లో మొత్తం తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయగా, సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఆంగ్ల మీడియాలో మృతి చెందిన కీలక టెర్రరిస్టుల జాబితా ప్రచురితమైంది.

ముదస్సర్‌ ఖదాయిన్‌ ఖాస్‌ అలియాస్‌ అబు జుందాల్‌: ఇతను లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాది. ఇతని అంత్యక్రియలను పాక్ సైన్యం అధికారిక లాంఛనాలతో నిర్వహించినట్లు సమాచారం. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ అబ్దుల్‌ రవూఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్‌, పంజాబ్ (పాక్‌లోని) సీఎం, ఐజీ హాజరైనట్లు తెలుస్తోంది.

హఫీజ్‌ మహమ్మద్‌ జమీల్‌: జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలో కీలక సభ్యుడు. సంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజార్‌కు ఇతను పెద్ద బావమరిది.

మహమ్మద్‌ యూసఫ్‌ అజార్‌ అలియాస్‌ ఉస్తాద్‌ జీ అలియాస్‌ సలీమ్‌ అలియాస్‌ సాహబ్‌: జైషే ముఠాకు చెందిన మరో ముఖ్య ఉగ్రవాది. మసూద్‌ అజార్‌కు ఇతను మరో బావమరిది. ఐసీ-814 విమాన హైజాక్‌ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

ఖలీద్‌ అలియాస్‌ అబు అకాస: లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది. జమ్ముకశ్మీర్‌లో అనేక ఉగ్రదాడులకు ఇతను నేతృత్వం వహించాడు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఆయుధాల స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరించేవాడు. ఫైసలాబాద్‌లో ఇతని అంత్యక్రియలకు పాక్‌ సీనియర్‌ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్‌ హాజరైనట్లు సమాచారం.

మహమ్మద్‌ హసన్‌ ఖాన్‌: జైషే మహమ్మద్ ముఠాలో మరో కీలక సభ్యుడు. పీవోకేలోని జైషే ఆపరేషనల్‌ కమాండర్ ముఫ్తి అస్గర్‌ ఖాన్‌ కశ్మీరీ కుమారుడు. జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించడంలో ఇతనిది ప్రధాన పాత్ర.

లష్కరే తోయిబా, జైషే ఉగ్ర సంస్థల కీలక స్థావరాలే లక్ష్యంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. భారత్ లక్ష్యంగా చేసుకున్న వాటిలో లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలో ఉన్న లష్కరే ఉగ్ర శిబిరం కూడా ఉంది. 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్‌ కసబ్‌, డేవిడ్‌ హెడ్లీ ఇక్కడే శిక్షణ తీసుకున్నారు. అలాగే, జైషేకు చెందిన ప్రధాన కేంద్రమైన బహవల్‌పూర్‌లోని మర్కజ్‌ సుబాన్‌పైనా దాడి జరిగింది. ఈ దాడిలో మసూద్‌ అజార్‌ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు.


More Telugu News