Renu Desai: ప్లీజ్‌.. ఇలాంటి స‌మ‌యంలో అలాంటి పోస్టులు పెట్ట‌కండి: రేణు దేశాయ్‌

Renu Desais Appeal Amidst India Pakistan Tension
  • భారత్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం 
  • ఇలాంటి స‌మ‌యంలో కొంద‌రు వార్‌పై ఫ‌న్నీ రీల్స్, వీడియో పోస్ట్ చేస్తున్న వైనం
  • ఈ విష‌య‌మై సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించిన రేణు దేశాయ్‌
భారత్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇరుదేశాల మ‌ధ్య రోజురోజుకూ ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారుతున్నాయి. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త్... పాకిస్థాన్‌, పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీఓకే)ల‌లో ఉగ్ర‌స్థావరాలే ల‌క్ష్యంగా ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టింది. తొమ్మిది ప్రాంతాల్లో క్షిప‌ణి దాడులు నిర్వ‌హించి సుమారు 100 మంది ముష్క‌రుల‌ను మట్టుబెట్టింది. కానీ, దాయాది పాకిస్థాన్ మాత్రం నీచ బుద్ధితో భార‌త్‌లోని పౌరులే ల‌క్ష్యంగా స‌రిహ‌ద్దు వెంబ‌డి డ్రోన్‌, మిస్సైల్ దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త తీవ్ర‌త‌ర‌మైంది. ఇలాంటి స‌మ‌యంలో గ‌త మూడు రోజుల నుంచి సామాజిక మాధ్య‌మాల్లో చాలా వ‌ర‌కు భారత్‌, పాక్‌కు సంబంధించిన వార్ వీడియోలు, ఫొటోలతో కూడిన పోస్టులు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు యుద్ధంపై ఫ‌న్నీ వీడియోలు చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

ఈ విష‌య‌మై తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. ఇలాంటి స‌మ‌యంలో అలాంటి పోస్టులు పెట్ట‌డం క‌రెక్ట్ కాద‌న్నారు. కేవ‌లం వ్యూస్ కోసం ఇలాంటివి చేయొద్ద‌ని ఆమె కోరారు. ఈ మేర‌కు రేణు దేశాయ్ సుదీర్ఘ సోష‌ల్ మీడియా పోస్టు పెట్టారు. 

"ప్ర‌స్తుతం ఇరుదేశాల మ‌ధ్య యుద్ధ‌ ప‌రిస్థితులు తీవ్రత‌ర‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో కొంత‌మంది వ్యూస్ కోసం ఫ‌న్నీ రీల్స్, వీడియోలు చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ యూజ‌ర్ల‌కు నేను ఒక విష‌యం చెప్పాల‌నుకుంటున్నాను. ఈరోజు మ‌నం భ‌యంలేకుండా మ‌న ఇళ్ల‌ల్లో నిద్ర‌పోతున్నామంటే.. దానికి కార‌ణం బార్డ‌ర్‌లో సైనికులు త‌మ ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌ర్తిస్తున్నారు కాబ‌ట్టే. 

వారి, వారి కుటుంబ స‌భ్యుల బాధ‌ను అర్థం చేసుకోండి. మ‌న ప్రార్థ‌న‌లు వారికి అండ‌గా ఉంటాయి. ఇలాంటి సున్నిత‌మైన‌ స‌మ‌యంలో మ‌నం ఐక్యంగా ఉండాలి. స‌బ్‌స్క్రైబ‌ర్లను పెంచుకోవాల‌నో, ఎక్కువ‌గా వ్యూస్ రావాల‌నో వార్‌పై ఫ‌న్నీ రీల్స్, వీడియోలు చేయ‌డం స‌బ‌బు కాదు" అని రేణు దేశాయ్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.   

 
Renu Desai
Pawan Kalyan
India-Pakistan War
Social Media Posts
War Videos
Border Tension
Surgical Strike
Operation Sindhu
Drone Attacks
Missile Attacks

More Telugu News