ఉగ్రవాదులను చంపుతుంటే మీకేంటి బాధ.. మతం చూసి దాడులు చేసినప్పుడు ఎక్కడున్నారు?: రఘునందన్ రావు ఆగ్రహం

  • భారత్ యుద్ధానికి సిద్ధపడితే ప్రపంచ పటంలో ఉండదని హెచ్చరిక
  • ఉగ్రవాదుల ఏరివేతను విమర్శించే వారిపై ఆగ్రహం, దేశద్రోహులుగా అభివర్ణన
  • ప్రధాని మోదీ శాంతిని కోరుకోవడం వల్లే ఇన్నాళ్లూ యుద్ధం జరగలేదని వ్యాఖ్య
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, వారికి మద్దతు పలికే శక్తులపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ నిజంగా యుద్ధానికి సిద్ధపడితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ అదృశ్యమవుతుందని ఆయన హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ శాంతిని కోరుకుంటున్నందునే ఇన్ని రోజులుగా యుద్ధ వాతావరణం తలెత్తలేదని, దేశం గొప్ప సంయమనం పాటిస్తోందని అన్నారు.

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొన్న సందర్భంగా రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. గత మూడు రోజులుగా 'ఆపరేషన్ సింధూర్' పేరిట ధర్మయుద్ధం జరుగుతుంటే, ఈ దేశంలోనే ఉంటూ కొందరు దానిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వీరిలో కమ్యూనిస్టులు, వివిధ రంగుల జెండాలు కలిగిన నాయకులు, పాత్రికేయుల ముసుగులో కొందరు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

"ఉగ్రవాదులను హతమారుస్తుంటే వీరికి ఎందుకు అంత బాధ? మతం చూసి మరీ దాడులు చేస్తుంటే ఈ మేధావులు ఎక్కడ ఉన్నారు? నిరంతరం హత్యలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా?" అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కాళ్లకు పారాణి ఆరకముందే సింధూరం కోల్పోయిన ఆడబిడ్డల ఆవేదనను ప్రస్తావిస్తూ, వారి ఆర్తనాదాల వల్లే ఇద్దరు మహిళలు ధర్మ యుద్ధానికి సారథ్యం వహించారని తెలిపారు.

ఈ దాడుల్లో ఏ ఒక్క పాకిస్థానీ సామాన్యుడినీ లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం ఉగ్రవాదుల స్థావరాల పైనే దాడులు జరిగాయని స్పష్టం చేశారు. దేశం చూపిస్తున్న సహనాన్ని చేతకానితనంగా భావిస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

వాళ్లను ఎప్పుడు పంపించివేస్తున్నారు?

రాష్ట్రంలో నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్థానీలను ఎప్పుడు పంపించివేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రఘునందన్ రావు ప్రశ్నించారు. ర్యాలీలు నిర్వహించడం ద్వారా మద్దతు లభించదని, దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రభుత్వ ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కొందరు ప్రొఫెసర్లు దేశ సంపదతో జీతాలు పొందుతూ ఉగ్రవాదుల పట్ల ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదులకు మద్దతు పలికే వారందరూ దేశద్రోహులతో సమానమని, కన్నతల్లికి అన్నం పెట్టని వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News