Chandrababu Naidu: భారత్- పాక్ యుద్ధం నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం

- ఢిల్లీలోని ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- సరిహద్దు రాష్ట్రాల్లోని ఏపీ పౌరులకు సహాయం, సమాచారం అందించడమే లక్ష్యం
- ఎలాంటి సహాయం కోసమైనా కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చన్న చంద్రబాబు
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు రాష్ట్రాలలో నివసిస్తున్న లేదా ఆయా ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పౌరుల సౌకర్యార్థం న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను తక్షణమే ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు.
పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న జమ్మూకశ్మీర్, లడఖ్ తో పాటు, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉన్న లేదా ఆ రాష్ట్రాలకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవసరమైన సమాచారం, సహాయం కోసం ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని చంద్రబాబు సూచించారు. ఈ సహాయ కేంద్రం రోజులో 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ నిరంతరాయంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత సున్నితమైన పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ, కేంద్ర ప్రభుత్వం మరియు సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలతో ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారని తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సహాయం మరియు సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
- 011-23387089
- 9871999430
- 9871999053
అదనపు సమాచారం లేదా ప్రత్యేక సహాయం కోసం:
- ఎం.వి.ఎస్. రామారావు, డిప్యూటీ కమిషనర్: 98719 90081.
- వి. సురేశ్ బాబు, లైజన్ ఆఫీసర్: 9818395787.