Indiramma Housing Scheme: రూ. 5 లక్షలతో 15 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు రెడీ!

Indiramma House Ready in 15 Days with Rs 5 Lakhs
  • నూతన నిర్మాణ పద్ధతులపై దృష్టి
  • సంగారెడ్డి జిల్లా జిన్నారంలో నమూనా ఇంటిని నిర్మించిన స్టార్టప్ కంపెనీ
  •  షీర్‌వాల్ పద్ధతిలో కేవలం 15 రోజుల్లోనే పూర్తి 
  •  నిర్మాణం పర్యావరణ హితం.. 60 ఏళ్ల మన్నిక  
 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకంలో భాగంగా నిర్దేశిత రూ.5 లక్షల బడ్జెట్‌లోనే నాణ్యమైన గృహాలను అందించేందుకు వినూత్న సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో, పలు ఏజెన్సీలు ఆధునిక నిర్మాణ పద్ధతులతో ముందుకు వస్తుండగా, ఓ స్టార్టప్ కంపెనీ కేవలం 15 రోజుల్లోనే షీర్‌వాల్‌ పద్ధతిలో ఆదర్శ ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఆశలు రేకెత్తించింది.

హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారుల సూచనలతో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఈ నమూనా ఇంటిని నిర్మించారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.5 లక్షల లోపు వ్యయంతోనే ఈ నిర్మాణం పూర్తి చేసినట్లు సంస్థ ప్రతినిధి మల్లికార్జున్‌ గురువారం మీడియాకు తెలిపారు. ఆరుగురు కార్మికులతోనే, పూర్తి పర్యావరణ హితంగా ఈ ఇంటిని నిర్మించినట్లు ఆయన వివరించారు. పునాది పనులకు ఐదు రోజులు, స్లాబ్‌, గోడల నిర్మాణానికి ఆరు రోజులు, మిగతా పనులకు నాలుగు రోజులు పట్టినట్లు పేర్కొన్నారు.

షీర్‌వాల్‌ ఇంటి ప్రత్యేకతలు
షీర్‌వాల్‌ పద్ధతిలో నిర్మించిన ఇంటి వివరాలను సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. "మొత్తం 400 చదరపు అడుగుల స్లాబ్‌తో, 22.3 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పుతో ఈ ఇంటిని నిర్మించాం. భవిష్యత్తులో ఇంటిపై మరో అంతస్తు (జీ+1) నిర్మించుకునేందుకు వీలుగా నిర్మాణం చేపట్టాం. 8 ఎంఎం, 10 ఎంఎం స్టీల్‌, రెడీమిక్స్‌ సెల్ఫ్‌ కాంపాక్ట్‌ కాంక్రీట్‌, అల్యూమినియం ప్యానెళ్లను వినియోగించాం. బయటి గోడల మందం 150 ఎంఎం ఉంటుంది. ఈ పద్ధతి వలన ఇంటికి పగుళ్లు రావడం, నీరు లీకవడం వంటి సమస్యలు ఉండవు. ప్లాస్టరింగ్‌ కూడా అవసరం లేదు. సుమారు 60 ఏళ్ల వరకు ఈ ఇల్లు దృఢంగా ఉంటుంది" అని తెలిపారు. ఇలాంటి ఇళ్లను రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిదారులకు నిర్మించి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సదరు స్టార్టప్‌ కంపెనీ ప్రకటించింది.

ఇందిరమ్మ ఇంటిని తక్కువ ఖర్చుతో, బడ్జెట్‌ పరిమితుల్లోనే నిర్మించేందుకు ఆసక్తి చూపే వివిధ ఏజెన్సీలకు అవకాశం కల్పిస్తున్నామని హౌసింగ్‌ కార్పొరేషన్‌ సీఈవో చైతన్యకుమార్‌ తెలిపారు. ఈ నూతన పద్ధతులు విజయవంతమైతే, పేదల సొంతింటి కల మరింత వేగంగా, నాణ్యతతో నెరవేరే అవకాశం ఉంది.
Indiramma Housing Scheme
Telangana Government
Shear Wall Construction
Prefabricated Houses
Sustainable Housing
Innovative Construction Techniques
15-Day House Construction

More Telugu News