Ambati Rayudu: యుద్ధం జరుగుతున్న వేళ... అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు

India Pakistan Conflict Ambati Rayudus Comments Create Controversy
  • పహల్గామ్‌ ఉగ్రదాడులపై భారత్ ప్రతిచర్యపై అంబటి రాయుడు వివాదాస్పద ట్వీట్
  • కంటికి కన్ను సమాధానమైతే ప్రపంచం గుడ్డిదవుతుందని వ్యాఖ్య
  • సోషల్ మీడియాలో రాయుడిపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం, విమర్శలు
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రతిగా భారత సైనిక దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌ 2.0'పై భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. "కంటికి కన్ను అనుకుంటూ పోతే యావత్ ప్రపంచం గుడ్డిదైపోతుంది" అని రాయుడు ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాయుడిని విమర్శలతో ముంచెత్తుతున్నారు.

విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ పలువురు నెటిజన్లు రాయుడిని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు ప్రతిఘటన అవసరమని, లేకపోతే వారు మరింత రెచ్చిపోతారని అంటున్నారు. కొందరైతే రాయుడిని పాకిస్థాన్ సానుభూతిపరుడిగా అభివర్ణిస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారత దళాలు కేవలం పాక్ దుశ్చర్యలను తిప్పికొడుతున్నాయనే నిజాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సైన్యానికి మద్దతుగా నిలవాల్సింది పోయి, శాంతి వచనాలు పలకడం సరికాదని హితవు పలుకుతున్నారు.

ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన తీవ్ర వ్యతిరేకతతో అంబటి రాయుడు కొంత వెనక్కి తగ్గారు. వివాదాస్పదమైన మొదటి ట్వీట్‌ను తొలగించనప్పటికీ, ప్రజాగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నంలో భాగంగా మరో రెండు ట్వీట్లు చేశారు. వీటిలో మొదటిదానిలో, "జమ్మూకశ్మీర్, పంజాబ్ తో పాటు భారతదేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతల కోసం ప్రార్థిస్తున్నాను. దాడులతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, భద్రత, త్వరిత పరిష్కారం లభించాలని ఆశిస్తున్నాను. జై హింద్!" అని రాసుకొచ్చారు.

ఆ తర్వాత చేసిన మరో ట్వీట్‌లో, "ఇలాంటి క్షణాల్లో మనం భయంతో కాదు, దృఢ సంకల్పంతో ఐక్యంగా నిలబడతాం. అసమానమైన ధైర్యం, క్రమశిక్షణ, నిస్వార్థతతో దేశ భారాన్ని మోస్తున్న మన భారత సైన్యానికి కృతజ్ఞతలు. మీ త్యాగాలు గుర్తించబడకుండా పోవు. మీ ధైర్యమే మువ్వన్నెల జెండాను ఎగురవేస్తుంది. మీ శౌర్యమే మన సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. మరింత శాంతియుత రేపటికి మీ సేవ మార్గం సుగమం చేయాలి. జై హింద్!" అంటూ సైన్యాన్ని ప్రశంసించారు.

అయితే, రాయుడు చేసిన ఈ దిద్దుబాటు వ్యాఖ్యలు కూడా నెటిజన్ల ఆగ్రహాన్ని పూర్తిగా తగ్గించలేకపోయాయి. ఆయన మొదట చేసిన "కంటికి కన్ను" ట్వీట్‌నే పట్టుకుని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు ఆయన క్రికెట్ కెరీర్, ఐపీఎల్, రాజకీయ నేపథ్యాలను ప్రస్తావిస్తూ తమదైన శైలిలో వ్యాఖ్యానిస్తున్నారు.
Ambati Rayudu
controversial tweets
Operation Sindhu 2.0
Pakistan
India
Indian Army
terrorism
social media outrage
cricket
IPL

More Telugu News