Chandrababu Naidu: రేపు ఉరవకొండ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu Naidus Uravakonda Visit for Handrineeva Project Inspection
  • హంద్రీనీవా సుజల స్రవంతి పూర్తికి సీఎం చంద్రబాబు దృఢ సంకల్పం.
  • రేపు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రాజెక్టు పనుల పరిశీలన
  • ఫేజ్ 1, 2 కాలువ లైనింగ్, వెడల్పు పనులకు రూ.3,873 కోట్ల కేటాయింపు
  • కాలువ వెడల్పుతో నీటి సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెంపు
  • వచ్చే నెలకల్లా మొదటి దశ, 2025 జూన్‌ నాటికి ఫేజ్-1 పూర్తి లక్ష్యం
రాయలసీమ ప్రాంతపు జీవనాడిగా భావిస్తున్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించేందుకు ఆయన రేపు (మే 9) అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయాపురంలో పర్యటించి, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించనున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, హంద్రీనీవా ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ మరియు వెడల్పు పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 2019 తర్వాత ప్రాజెక్టుపై నెలకొన్న నిర్లక్ష్యాన్ని వీడి, 2025 జూన్ నాటికి ఫేజ్-I పనులు పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలకల్లా మొదటి దశ పూర్తి కానుంది. ఫేజ్ 1, 2 కాలువ లైనింగ్, వెడల్పు పనులకు మొత్తం రూ.3,873 కోట్లు కేటాయించారు. ఈ పనులతో కాలువ నీటి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 2,200 క్యూసెక్కుల నుండి 3,850 క్యూసెక్కులకు గణనీయంగా పెరగనుంది.

2014-19 మధ్య టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టుపై సుమారు రూ.4 వేల కోట్లకు పైగా వ్యయం చేసి, గొల్లపల్లి, మడకశిర, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లను పూర్తి చేసి, కియా వంటి పరిశ్రమలకు నీరందించారు. ప్రస్తుతం ఫేజ్-1 కింద రూ.696 కోట్లతో, ఫేజ్-2 కింద రూ.1,256 కోట్లతో ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ (0-75 కి.మీ) పనులు చేపట్టారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ (75-207 కి.మీ) పనులు రూ.480 కోట్లతో, కుప్పం బ్రాంచ్ కాలువ పనులు రూ.197 కోట్లతో ప్రారంభమై వేగంగా పురోగతి సాధిస్తున్నాయి.

చంద్రబాబు ఉరవకొండ నియోజకవర్గ పర్యటన షెడ్యూల్

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరతారు. 10.10 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి 10.50 గంటలకు పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నించి హెలికాప్టర్ లో బయల్దేరి 11.25 గంటలకు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం చేరుకుంటారు. 11.40 గంటలకు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ఛాయాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభకు హాజరవుతారు. అనంతరం 3.10 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నించి బెంగళూరు పయనమవుతారు. బెంగళూరులో సీఎం చంద్రబాబు 'ది హిందూ హడల్: ఇండియా ఇన్ డైలాగ్' అనే కార్యక్రమానికి హాజరవుతారు.

Chandrababu Naidu
Handrineeva Sujala Sravanthi Project
Uravakonda
Anantapur
Andhra Pradesh
Rayalaseema
Project Inspection
Water Project
Irrigation Project

More Telugu News