Google: గూగుల్‌లో మరోసారి లేఆఫ్స్‌.. ఈసారి ఎంత‌మందిని తొల‌గించిందంటే..!

Google Announces More Layoffs Tech Giant Cuts 200 Jobs
  • సేల్స్‌, పార్ట్‌నర్‌షిప్‌ విభాగాలను పర్యవేక్షించే 200 మంది ఉద్యోగులపై వేటు
  • కంపెనీలో పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగానే లేఆఫ్స్‌ ప్రకటించినట్లు స‌మాచారం
  • నెల రోజుల వ్యవధిలోనే గూగుల్‌ తన ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించడం ఇది రెండోసారి
ప్రపంచవ్యాప్తంగా టెక్‌ ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్‌ వార్‌, అమెరికాలో మాంద్యం భయాలు, ఏఐ వినియోగం పెరగడం త‌దిత‌ర కార‌ణాల‌తో కంపెనీలు త‌మ వ్య‌యాన్ని తగ్గించుకునే ప‌నిలోప‌డ్డాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’ ఉద్యోగులకు మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది.

సేల్స్‌, పార్ట్‌నర్‌షిప్‌ విభాగాలను పర్యవేక్షించే తమ గ్లోబల్‌ బిజినెస్‌ ఆర్గనైజేషన్‌లో 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు స‌మాచారం. ఈ మేరకు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. 'రాయిటర్స్‌'కు ఇచ్చిన ప్రకటనలో గూగుల్ ఈ మార్పులను చిన్న సర్దుబాట్లుగా అభివర్ణించింది. కంపెనీలో పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగానే లేఆఫ్స్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. 

ఇక నెల రోజుల వ్యవధిలోనే గూగుల్‌ తన ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత నెలలో కూడా ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌, పిక్సెల్‌ ఫోన్లు, క్రోమ్‌ బ్రౌజర్లలో పనిచేసే ఉద్యోగులపై వేటు వేసింది. ఇక గతేడాది అంటే 2024 డిసెంబర్‌లో 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది (2023) జనవరిలో 12 వేల మంది ఉద్యోగులకు గూగుల్ ఉద్వాసన పలికింది. కాగా, 2024 డిసెంబర్ నాటికి కంపెనీ 1,83,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది.
Google
Google layoffs
Tech layoffs
Google job cuts
Global tech layoffs
AI impact on jobs
Economic slowdown
Google restructuring
Reuters
Tech industry

More Telugu News