UK Visa Restrictions: పాక్ పౌరుల వీసాలపై బ్రిటన్ ఆంక్షలు!

- పాక్ పౌరుల వీసాలపై బ్రిటన్ ఆంక్షలు
- బ్రిటన్‌లో శాశ్వత నివాసం కోసం అసాధారణ స్థాయిలో పెరుగుతున్న దరఖాస్తులు
- పాకిస్థానీ పౌరులతో పాటు నైజీరియా, శ్రీలంక పౌరుల స్టడీ, వర్క్ వీసాలపైనా ఆంక్షలు
- వీసాలు జారీ చేసే సమయంలోనే కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం
పాక్ పౌరుల వీసాలపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. ఆసైలం (శాశ్వత నివాసం) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థానీ పౌరులకు బ్రిటన్ వీసా నిబంధనలను కఠినతరం చేయనుంది. చదువు, ఉద్యోగం కోసం దేశానికి వచ్చి శాశ్వతంగా స్థిరపడుతున్న వీసా ఓవర్ స్టేలు, ఆసైలం దరఖాస్తులపై కఠినమైన పరిమితులను విధించనున్నట్లు టైమ్స్ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. పాకిస్థానీ పౌరులతో పాటు నైజీరియా, శ్రీలంక నుంచి వచ్చే వారి స్టడీ, వర్క్ వీసాలపైనా నిబంధనలను కఠినతరం చేస్తోంది.
బ్రిటన్‌లో శాశ్వత నివాసం కోసం వీసా హోల్డర్ల నుంచి ఇటీవల దరఖాస్తులు అసాధారణ స్థాయిలో పెరుగుతుండగా, ఇందులో పాకిస్థానీ పౌరులు అగ్రస్థానంలో ఉన్నారు. గణాంకాల ప్రకారం 2024లో మొత్తం 1,08,000 మంది ఆసైలం కోసం దరఖాస్తు చేసుకోగా, వీరిలో అత్యధికంగా 10,542 మంది పాకిస్థానీ పౌరులే ఉన్నారు. వర్క్, స్టూడెంట్ లేదా విజిటర్స్ వీసాలపై వచ్చి ఆ తర్వాత ఆసైలం కోసం దరఖాస్తు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వీసాలు జారీ చేసే సమయంలోనే కఠినంగా వ్యవహరించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త నిబంధనల్లో భాగంగా వీసా దరఖాస్తులను వారి ఆసైలం దరఖాస్తు రిస్క్‌ను అంచనా వేయడానికి ప్రొఫైలింగ్ చేస్తారు. అధిక రిస్క్‌గా భావించిన వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తారు. అంతే కాకుండా వీసా హోల్డర్లు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నట్లు నిరూపించుకోకపోతే, వారి పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే వసతి సౌకర్యాలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బ్రిటన్ ప్రభుత్వం 2024లో కేర్ వర్కర్లు, స్టూడెంట్లకు డిపెండెంట్లను తీసుకురాకుండా కఠిన నిబంధనలు విధించింది. దీంతో అప్పటి నుంచి 2025 మార్చి నాటికి వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గాయి.