: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో భారీ ఊరట: ఏసీబీ కేసు కొట్టివేత

  • నిఘా పరికరాల కొనుగోలు ఆరోపణలపై హైకోర్టులో కీలక తీర్పు
  • ఏసీబీ నమోదు చేసిన కేసు, చార్జిషీట్‌ను కొట్టివేసిన న్యాయస్థానం
  • ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసిన కోర్టు
విశ్రాంత ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావుకు (ఏబీవీ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం భారీ ఊరట లభించింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసును, విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఏసీబీ మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

భద్రత, నిఘా పరికరాల కొనుగోలు టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో 2021 మార్చిలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ బుధవారం తుది తీర్పు వెలువరించారు.

పిటిషనర్‌పై ఏసీబీ మోపిన ఆరోపణలు విచారణలో నిలబడవని, అవి అస్పష్టంగా, నిరాధారంగా ఉన్నాయని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. చట్టం ముందు ఈ అభియోగాలు చెల్లుబాటు కావని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు దిగువ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇటీవల జరిగిన తుది విచారణలో ఏబీ వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. భద్రతా పరికరాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది, కొనుగోలు కమిటీ, సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది నాటి డీజీపీయేనని, ఆయా కమిటీలలో సీనియర్ అధికారుల పేర్లను మాత్రమే ఏబీవీ సూచించారని తెలిపారు. అధికార హోదాను అడ్డుపెట్టుకుని కమిటీల నిర్ణయాలను ప్రభావితం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

పరికరాల కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, అలాంటప్పుడు అనుచిత లబ్ధి పొందే ప్రశ్నే ఉత్పన్నం కాదని న్యాయవాది వాదించారు. ఏబీవీ కుమారుడికి చెందిన ‘ఆకాశ్  అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌’ సంస్థకు టెండర్‌ దక్కించుకున్న ఇజ్రాయెల్‌ సంస్థతో ఎలాంటి అనుబంధం లేదని, ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ కంపెనీయే స్పష్టం చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్ చర్యల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, అంతిమంగా ఆ టెండర్‌ను అప్పటి డీజీపీ రద్దు చేశారని తెలిపారు. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు ఈ కేసులో వర్తించవని, కావున కేసును కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన కేసును, చార్జిషీట్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.

More Telugu News