Himanshi Narwal: పెళ్లైన కొన్ని రోజులకే ఉగ్రవాదులు నా జీవితాన్ని లాగేసుకున్నారు.. ఆపరేషన్ సిందూర్ పేరు సరిపోయింది: హిమాన్షీ నర్వాల్

Himanshi Narwal Operation Sindhoor is apt terrorists took away my life
  • పహల్గామ్ దాడిలో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ స్పందన
  • ఉగ్రవాదులపై సైనిక చర్యకు 'ఆపరేషన్ సిందూర్‌' పేరు సరైనదని అభిప్రాయం
  • ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించి, శాంతి నెలకొల్పాలని విజ్ఞప్తి
  • ఆపరేషన్ సిందూర్‌తో తన భర్త ఆత్మ శాంతించి ఉంటుందని వ్యాఖ్య
పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ, పాకిస్థాన్ ఉగ్రమూకలపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యకు 'ఆపరేషన్ సిందూర్‌' అనే పేరు పెట్టడం అత్యంత సమంజసమని, దానిని తాను బాగా అర్థం చేసుకోగలనని అన్నారు.

ఓ ఆంగ్ల మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు కొనసాగించి ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయాలని ఆకాంక్షించారు.

"దేశంలో శాంతి స్థాపన కోసం, ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్న గొప్ప లక్ష్యంతోనే నా భర్త రక్షణ దళాల్లో చేరారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన స్ఫూర్తి సజీవంగానే ఉంది. అమాయకుల ప్రాణాలు తీసి, వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచిన ఉగ్రవాదులకు తగిన శిక్ష పడటం చూసి ఆయన ఆత్మ శాంతించి ఉంటుందని భావిస్తున్నాను" అని హిమాన్షీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని, తనలాంటి దుస్థితి మరే కుటుంబానికి రాకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"నాకు ఇటీవలే వివాహమైంది. 'ఆపరేషన్ సిందూర్‌' అనే పేరు నా వేదనకు సరిగ్గా సరిపోతుంది. ఉగ్రవాదులు నా జీవితాన్ని లాగేసుకున్నారు. ఒక్క క్షణంలో నా బతుకు తలకిందులైంది. నాతో పాటు ఎంతో మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. పురుషులు కూడా తమ తండ్రులను, సోదరులను కోల్పోయారు" అంటూ ఆమె తన బాధను వెళ్లగక్కారు. "నిజం చెప్పాలంటే, నేను అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతం. కానీ, ఈ చర్యతో కొంత ఊరట లభించింది. ఉగ్రవాదం అంతానికి ఇది ఆరంభం కావాలి. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి అమరవీరుల హోదా కల్పించాలి" అని హిమాన్షీ డిమాండ్ చేశారు.
Himanshi Narwal
Operation Sindhoor
Pulwama Attack
Pakistan Terrorism
Indian Army
Navy Officer Vinay Narwal
Anti-Terrorism
Counter-Terrorism
Surgical Strike

More Telugu News