Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' షూటింగ్ ముగించుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyans Hari Hara Veera Mallu Shooting Wraps Up
  • పవన్ కథానాయకుడిగా హరిహర వీరమల్లు
  • క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్ లో చిత్రం
  •  హైదరాబాదులోని ప్రత్యేక సెట్‌లో చివరి షెడ్యూల్ ముగింపు
  • రెండు రోజులు చిత్రీకరణలో పాల్గొన్న పవన్
  • త్వరలో ట్రైలర్, పాటలు, కొత్త విడుదల తేదీ వెల్లడి
  • రెండు భాగాలుగా రానున్న చారిత్రక చిత్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం 'హరిహర వీరమల్లు' చిత్రీకరణ ఎట్టకేలకు పూర్తయింది. పలుమార్లు వాయిదాల అనంతరం, ఈ సినిమా షూటింగ్ ఈ వారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ముగిసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీవారణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం రెండు రోజులు కేటాయించారు. ఈ రెండు రోజుల్లో ఆయనకు సంబంధించిన మిగిలిన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు. షూటింగ్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా, సాంప్రదాయబద్ధంగా గుమ్మడికాయ కొట్టే కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో, నిర్మాతలు త్వరలోనే సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పలు వాయిదాల కారణంగా నిరాశ చెందిన అభిమానులకు ఇది ఊరటనిచ్చే అంశం.

క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఆసక్తికరమైన చారిత్రక కథనంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. వాస్తవానికి మే 9న విడుదల కావాల్సి ఉండగా, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలు, సినిమా షూటింగ్ షెడ్యూళ్ల మధ్య సమన్వయం కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. త్వరలోనే ట్రైలర్, కొత్త పాటలు విడుదల చేసి సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది. "పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గారు 'హరిహర వీరమల్లు' చివరి రెండు రోజుల షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఈ భారీ సినిమా షూటింగ్ ప్రయాణం దిగ్విజయంగా ముగిసింది. మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ట్రైలర్, అద్భుతమైన పాటలు త్వరలోనే మీ ముందుకు రానున్నాయి. తుపానుకు కౌంట్‌డౌన్ ఇప్పుడు మొదలైంది" అని మేకర్స్ తెలిపారు.

ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి ప్రవేశించనుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావడంతో, పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం 'ఓజీ' పై దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. 'ఓజీ' సినిమా షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా కొంత ఆలస్యమైన విషయం తెలిసిందే. 
Pawan Kalyan
Hari Hara Veera Mallu
Telugu Movie
Movie Shooting
Tollywood
Nidhhi Agerwal
MM Keeravaani
Krish Jagarlamudi
Historical Film
Post-Production

More Telugu News