Batthi Kirti: డాక్టర్ వీడియో కాల్ ట్రీట్మెంట్... తెలంగాణ మహిళ గర్భంలోనే కవలలు మృతి

Medical Negligence Case Woman Loses Twins After Video Call Consultation
  • ఏడేళ్ల తర్వాత ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన మహిళ
  • డాక్టర్ ఫోన్‌లో సూచనలు, నర్సుల చికిత్సతో కవలలు మృతిచెందారని ఆరోపణ
  • వైద్యురాలి నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు, కేసు నమోదు
ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సంతాన భాగ్యానికి నోచుకున్న ఓ దంపతుల ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా కడుపులోనే కవలలు మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. డాక్టర్ అందుబాటులో లేని సమయంలో ఫోన్ ద్వారా ఆమె ఇచ్చిన సూచనల మేరకు నర్సులు చేసిన వైద్యం వికటించిందని బాధితురాలు వాపోతున్నారు.

వివరాల్లోకి వెళితే, రంగారెడ్డి జిల్లా ఎలిమినేడు గ్రామానికి చెందిన బత్తి కీర్తి వివాహమైన ఏడేళ్ల తర్వాత ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పద్ధతి ద్వారా ఐదు నెలల క్రితం గర్భం దాల్చారు. ఆమె డాక్టర్ అనుషా రెడ్డి పర్యవేక్షణలో విజయలక్ష్మి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గత నెలలో సాధారణ తనిఖీల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా, కీర్తి గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉందని గుర్తించిన డాక్టర్ అనుషా రెడ్డి, కొన్ని కుట్లు వేసి, విశ్రాంతి తీసుకోవాలని సూచించి ఇంటికి పంపినట్లు సమాచారం.

అయితే, సుమారు నెల రోజుల తర్వాత, గత ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కీర్తికి తీవ్రమైన ప్రసవ వేదన రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన అదే విజయలక్ష్మి ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో డాక్టర్ అనుషా రెడ్డి ఆసుపత్రిలో అందుబాటులో లేరని తెలిసింది. దీంతో డాక్టర్ అనుషా రెడ్డి ఆడియో, వీడియో కాల్స్ ద్వారా నర్సులకు పలు వైద్య ప్రక్రియలు చేపట్టాలని, ఇంజక్షన్లు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. నొప్పి నివారణకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కీర్తికి వేసిన కుట్లు ఊడిపోయాయని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో కీర్తి గర్భం నుంచి శిశువులను బయటకు తీశారు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. అప్పటికే ఆసుపత్రికి చేరుకున్న డాక్టర్ అనుషా రెడ్డి... కవలలు మృతిచెందినట్లు తెలిపారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

"నాకు కడుపులో నొప్పిగా ఉండటంతో ఫోన్ చేస్తే ఇంజక్షన్ తీసుకోమన్నారు. ఆందోళనగా ఉండటంతో అరగంటలో ఆసుపత్రికి వచ్చాం. డాక్టర్ ఫోన్‌లోనే నర్సులకు సలహాలివ్వడంతో వారు చికిత్స ప్రారంభించారు. నర్సు నన్ను రెండుసార్లు తనిఖీ చేశారు. నాకు రక్తస్రావం మొదలైంది. నా బిడ్డలు బయటకు వచ్చిన తర్వాతే డాక్టర్ వచ్చారు. పిల్లలు చనిపోయారని చెప్పారు. డాక్టర్ నన్ను అసలు చూడనే లేదు" అని కీర్తి కన్నీటిపర్యంతమయ్యారు.

కీర్తి కుటుంబ సభ్యులు వైద్య నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆరోగ్యశాఖ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Batthi Kirti
Dr. Anusha Reddy
Vijaya Lakshmi Hospital
Rangareddy District
Telangana
Twin Babies Death
Medical Negligence
IVF Treatment
Doctor Video Call Treatment
Miscarriage

More Telugu News