Trisha: నేను అందాల పోటీల్లో పాల్గొనే సమయంలో అమ్మకు ఒక కండిషన్ పెట్టా: త్రిష

Trisha Reveals Shocking Career Beginning A Mothers Agreement

  • వయసు 41 అయినా చెక్కుచెదరని త్రిష అందం
  • తొలి సినిమా ఒప్పందంపై సంతకానికి ముందు తల్లికి షరతు విధించిన వైనం
  • సినిమా విజయం సాధించకపోతే నటన వదిలి సైకాలజిస్ట్ అయ్యేదాన్నని వెల్లడి

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి త్రిష, వయసు నాలుగు పదులు దాటినా ఇప్పటికీ అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, భవిష్యత్ ప్రణాళికలను ఆమె పంచుకున్నారు. సినిమా రంగంలోకి ప్రవేశించే ముందు తాను పెట్టుకున్న ఒక షరతు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ, "అప్పట్లో అందాల పోటీల్లో పాల్గొంటూ, కొన్ని ప్రకటనల్లో నటిస్తున్న సమయంలో నాకు తొలి సినిమా అవకాశం వచ్చింది. అయితే, ఆ సినిమా ఒప్పందంపై సంతకం చేసే ముందు మా అమ్మగారికి ఒక షరతు పెట్టాను. ఒకవేళ ఆ సినిమా సరిగ్గా ఆడకపోతే, నన్ను ఏమీ అనకూడదని, నేను వెంటనే సినిమాలు వదిలేసి నా చదువు కొనసాగిస్తానని చెప్పాను. ఆ షరతుకు అమ్మ అంగీకరించిన తర్వాతే అగ్రిమెంట్‌పై సంతకం చేశాను" అని త్రిష వివరించారు. ఒకవేళ నటిగా విజయవంతం కాకపోయి ఉంటే, తాను సైకాలజిస్ట్ అయ్యేదాన్నని కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

1999లో సినీ ప్రస్థానం ప్రారంభించిన త్రిష, 'నీ మనసు నాకు తెలుసు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'అతడు', 'పౌర్ణమి', 'స్టాలిన్' వంటి విజయవంతమైన చిత్రాలతో అగ్రతారగా ఎదిగారు. సుమారు 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలువురు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించారు. మధ్యలో కొంతకాలం ఆమె కెరీర్ నెమ్మదించినట్లు కనిపించినా, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ చిరంజీవి, కమల్ హాసన్, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Trisha
Trisha Krishnan
Tollywood
South Indian Actress
Telugu Cinema
Film Career
Early Career
Acting
Movie Debut
Condition to Mother
  • Loading...

More Telugu News