Haryana Ex-MLA: అరెస్టును తప్పించుకోవడానికి మాజీ ఎమ్మెల్యే పాట్లు.. నాటకీయంగా అరెస్ట్.. వీడియో ఇదిగో!

Haryana Ex MLA Dharm Singh Chhokers Dramatic Arrest in Delhi Hotel
  • పలు ఆర్థిక నేరాల్లో హర్యానా మాజీ ఎమ్మెల్యే ఛోకర్ పై అరెస్టు వారెంట్లు
  • అధికారుల నుంచి తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే
  • ఢిల్లీలోని ఓ హోటల్ లో ఛోకర్ పార్టీ చేసుకుంటుండగా ఈడీ అధికారుల ఎంట్రీ
హర్యానా మాజీ ఎమ్మెల్యే ధర్మ సింగ్ ఛోకర్ ను పలు ఆర్థిక నేరాల విచారణలో భాగంగా ఆదివారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఓ హోటల్ లో ఆయన విందు చేసుకుంటుండగా సడెన్ గా అధికారులు ఎంట్రీ ఇచ్చారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఛోకర్ ను వెంబడించి హోటల్ మెయిన్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఛోకర్ పరిగెత్తుతున్న దృశ్యాలు, హోటల్ మెయిన్ గేట్ వద్ద కింద పడిన వైనం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఛోకర్ పై ఏడు నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 

ఆదివారం రాత్రి ఢిల్లీలోని ప్రఖ్యాత షాంగ్రిలా హోటల్‌లోని గ్రాపా బార్‌లో ఛోకర్ పార్టీ చేసుకుంటున్నట్లు ఈడీ అధికారులకు పక్కా సమాచారం అందింది. గురుగ్రామ్ జోన్ ఈడీ జాయింట్ డైరెక్టర్ నవనీత్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వెంటనే హోటల్‌కు చేరుకుని, బార్‌లో ఉన్న ఛోకర్‌ను గుర్తించింది. అధికారులను చూడగానే అప్రమత్తమైన ఛోకర్, తన బాడీగార్డ్‌తో కలిసి పారిపోయేందుకు ఎగ్జిట్ వైపు పరుగులు తీశారు. అయితే, నవనీత్ అగర్వాల్ నేతృత్వంలోని భద్రతా సిబ్బంది వారిని వెంబడించి అడ్డుకున్నారు. తప్పించుకునే క్రమంలో ఛోకర్, ఈడీ అధికారులు, హోటల్ సిబ్బందిపై దాడికి కూడా ప్రయత్నించినట్లు తెలిసింది. భద్రతా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, హోటల్ ప్రధాన ద్వారం వద్ద ఛోకర్ ను అదుపులోకి తీసుకున్నారు.

గురుగ్రామ్‌ లోని ప్రత్యేక కోర్టు ఛోకర్‌పై పలు ఆర్థిక నేరాలకు సంబంధించి ఈ నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. అరెస్ట్ అనంతరం ఛోకర్‌ను తదుపరి విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తరలించారు. ఛోకర్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Haryana Ex-MLA
ED Arrest
Dharm Singh Chhoker
Financial Crimes
Delhi Hotel
Non-Bailable Warrants
ED Raids
CCTV Footage
Dramatic Arrest
India News

More Telugu News