రబాడాకు లైన్ క్లియర్... ఐపీఎల్ కు తిరిగొస్తున్నాడు!

  • దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడాపై తాత్కాలిక నిషేధం ఎత్తివేత
  • మాదకద్రవ్యాల వినియోగంపై రీహాబిలిటేషన్ విజయవంతంగా పూర్తి
  • గత జనవరి SA20 లీగ్‌లో నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు నిర్ధారణ
  • సైడ్స్ నిబంధనల ప్రకారం నెల రోజుల అనర్హత వేటు పూర్తి
  • మళ్లీ  క్రికెట్ ఆడేందుకు రబాడాకు అనుమతి
దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడాకు డోపింగ్ కేసులో ఊరట లభించింది. నిషేధిత ఉత్ప్రేరకాల వినియోగానికి సంబంధించిన రీహాబిలేషన్ కార్యక్రమాన్ని రబాడా విజయవంతంగా పూర్తి చేయడంతో, దక్షిణాఫ్రికా ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రగ్-ఫ్రీ స్పోర్ట్ (SAIDS - సైడ్స్) అతడిపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో రబాడా వెంటనే తిరిగి అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడేందుకు మార్గం సుగమమైంది.

ఈ ఏడాది జనవరిలో స్వదేశంలో జరిగిన ఎస్‌ఏ20 (SA20) లీగ్ సందర్భంగా రబాడా డోప్ పరీక్షలో పట్టుబడ్డారు. జనవరి 21న జరిగిన ఒక మ్యాచ్ అనంతరం నిర్వహించిన పరీక్షల్లో, అతడి శరీరంలో నిషేధిత 'వినోదభరిత మాదకద్రవ్యం' (Substance of Abuse) ఆనవాళ్లు ఉన్నట్లు సైడ్స్ నిర్ధారించింది. ఈ విషయాన్ని ఏప్రిల్ 1న రబాడాకు తెలియజేయడంతో పాటు, అతడిపై తక్షణమే తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో అప్పుడు ఐపీఎల్‌లో పాల్గొంటున్న రబాడా, టోర్నీ మధ్యలోనే స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

సైడ్స్ నిబంధనల ప్రకారం, కోకైన్, హెరాయిన్ వంటి కొన్ని పదార్థాలను 'సబ్‌స్టాన్సెస్ ఆఫ్ అబ్యూస్' గా పరిగణిస్తారు. వీటిని క్రీడా ప్రదర్శన మెరుగుపరుచుకోవడానికి కాకుండా, పోటీయేతర సమయంలో వాడినట్లు అథ్లెట్ నిరూపించుకోగలిగితే, సాధారణంగా విధించే మూడు నెలల నిషేధాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సైడ్స్ ఆమోదించిన చికిత్సా కార్యక్రమాన్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తే, నిషేధ కాలాన్ని ఒక నెలకు కుదిస్తారు (ఆర్టికల్ 10.2.4.1).

రబాడా తన డోపింగ్ ఉల్లంఘనకు పూర్తి బాధ్యత వహించాడని, తాత్కాలిక నిషేధాన్ని గౌరవించాడని సైడ్స్ తెలిపింది. నిర్దేశిత చికిత్సా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందున, అతడిపై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. "ఆటగాడు సమర్థవంతంగా ఒక నెల నిషేధ కాలాన్ని పూర్తి చేశాడు, ఇప్పుడు తిరిగి క్రీడల్లో పాల్గొనవచ్చు" అని సైడ్స్ స్పష్టం చేసింది. 

నిషేధం ముగిసిన నేపథ్యంలో, రబాడా తిరిగి ఐపీఎల్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ సీజన్ లో రబాడా గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ బుధవారం నాడు గుజరాత్ టైటాన్స్... ముంబయి ఇండియన్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ లో రబాడా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. 

ఈ సీజన్ లో రబాడా గుజరాత్ టైటాన్స్ తరఫున తొలి రెండు మ్యాచ్ లు ఆడాడు. ఆ తర్వాత నిషేధం అమల్లోకి రావడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. వ్యక్తిగత కారణాలతోనే రబాడా దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం పేర్కొంది. అయితే, తాను డ్రగ్స్ వాడిన కారణంగా నిషేధం విధించడం వల్లే జట్టుకు అందుబాటులో లేకుండా వెళ్లాల్సి వచ్చిందని కొన్ని రోజుల కిందటే రబాడా చెప్పడంతో ఈ విషయం అందరికీ తెలిసింది.


More Telugu News