Kakani Govardhan Reddy: తప్పు చేయకపోతే కాకాణి ఎందుకు పారిపోయారు? అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్ట్ కాబోతున్నారు: బీదా రవిచంద్ర

- కాకాణి, అనిల్ అక్రమ మైనింగ్ దోపిడీకి పాల్పడ్డారన్న బీదా రవిచంద్ర
- గూడూరు, సైదాపురంలో అనిల్ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపణ
- అరెస్ట్ భయంతోనే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపాటు
వైసీపీ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌ల పాత్ర ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆరోపించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులకు భయపడి పరారీలో ఉన్నారని, త్వరలోనే అక్రమ మైనింగ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్ట్ కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.
వైసీపీ పాలనలో జరిగిన మైనింగ్ దోపిడీ గురించి, అందులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాత్ర గురించి ప్రజలందరికీ తెలుసని బీదా రవిచంద్ర అన్నారు. "అక్రమాలు చేయకపోతే కాకాణి ఎందుకు పరారీలో ఉంటారు? బయటకు వచ్చి తాను నిజాయతీపరుడినని నిరూపించుకోవచ్చు కదా?" అని ఆయన ప్రశ్నించారు. కేసులకు భయపడటం వల్లే కాకాణి కనిపించకుండా పోయారని రవిచంద్ర ఎద్దేవా చేశారు.
రుస్తుం మైన్స్‌లో కాకాణి అక్రమ తవ్వకాలు చేయించారని ఆరోపించిన ఆయన, గతంలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపడితే, ఆయనపై దాడికి ప్రయత్నించిన ఘటనలకు వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు.
ఇన్నాళ్లూ ఎక్కడున్నారో తెలియని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు బయటకు వచ్చి, కాకాణిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీదా రవిచంద్ర అన్నారు. గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. "అక్రమ మైనింగ్ కేసులో త్వరలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ కాబోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతోనే భయపడి, ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు" అని బీదా రవిచంద్ర తెలిపారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనకు అధికారికంగా మైన్స్ ఉన్నాయని, వాటికి, వైసీపీ నేతల అక్రమ మైనింగ్‌కు సంబంధం లేదని రవిచంద్ర స్పష్టం చేశారు. మాజీ మంత్రుల అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.