మిస్ వరల్డ్ పోటీలు... హైదరాబాద్ కు చేరుకుంటున్న అందాల భామలు

  • 120 దేశాల నుంచి సుందరీమణులు, ఇప్పటికే పలువురి రాక ప్రారంభం
  • శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగత ఏర్పాట్లు, ప్రత్యేక డెస్క్‌లు
  • తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసిన పర్యాటక శాఖ
ప్రతిష్ఠాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మే 7వ తేదీన ప్రారంభమై జూన్ 2 వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల కోసం నగరం వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటికే హైదరాబాద్‌కు తరలివస్తున్నారు.

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వస్తున్న అందగత్తెలతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందడి వాతావరణం నెలకొంది. విదేశీ ప్రతినిధుల రాక ఈరోజు నుంచి మరింత పెరగనున్న నేపథ్యంలో, వారికి తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికేందుకు పర్యాటక శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయంలో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

ఇప్పటికే మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండుజ్‌ పెద్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయాలిజే జాన్సన్‌వాన్‌ రెన్స్‌బర్గ్‌ సహా దాదాపు 90 మంది పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు. విమానాశ్రయంలో పర్యాటక శాఖ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, అనంతరం వారిని బస ఏర్పాటు చేసిన హోటళ్లకు తరలించారు. 

ఇదిలా ఉండగా, ఈ పోటీలకు పాకిస్థాన్ నుంచి ప్రతినిధులు పాల్గొనడం లేదనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్థాన్ సుందరీమణులు ఈ పోటీలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ఈ క్రమంలోనే పాకిస్థానీలు ఏప్రిల్ 29 నాటికి దేశం విడిచి వెళ్లాలని సూచనలు అందాయని, ఈ పరిణామాల నేపథ్యంలోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాక్ ప్రాతినిధ్యం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


More Telugu News