NEET 2025: ‘నీట్’ పేపర్ చూసి నీరుగారిపోయిన అభ్యర్థులు.. జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో పేపర్

- అత్యంత కఠినంగా నీట్-2025 ఫిజిక్స్ విభాగం ప్రశ్నలు
- జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో ప్రశ్నలు, ఇదే తొలిసారి
- నిర్ణీత సమయంలో సమాధానాలు గుర్తించడంలో ఇబ్బందులు
- కెమిస్ట్రీ ప్రశ్నలు నిడివి ఎక్కువ, బయాలజీ మధ్యస్థం
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2025 (యూజీ) పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ ఏడాది ఫిజిక్స్ విభాగంలోని ప్రశ్నలు అత్యంత కఠినంగా రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిర్దేశిత వ్యవధిలో సమాధానాలు గుర్తించడం సవాలుగా మారిందని పలువురు అభ్యర్థులు వాపోయారు. ప్రశ్నల సరళి జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఉందని, నీట్ చరిత్రలోనే ఫిజిక్స్ ఇంత కఠినంగా రావడం ఇదే మొదటిసారని కోచింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించారు. ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. అధికారులు కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేశారు. వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించలేదు. కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, ట్రాఫిక్ సమస్యల కారణంగా కొందరు విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోలేకపోయారు. ఆలస్యంగా వచ్చిన వారిని నిబంధనల ప్రకారం అనుమతించకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
బయాలజీ విభాగంలో బోటనీ నుంచి 50 ప్రశ్నలు అడిగారు. ఈ సబ్జెక్టుపై మంచి పట్టున్న వారికి ఇది ప్రయోజనకరంగా మారింది. రీజన్ అండ్ అసెర్షన్, మ్యాచింగ్ తరహా ప్రశ్నలు అధికంగా కనిపించాయి. చాలా ప్రశ్నలు మధ్యస్థాయి కఠినత్వంతో ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. జువాలజీలో 'రీప్రొడక్షన్ హెల్త్' కు సంబంధించిన ఒక ప్రశ్న ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ పరిధిలో లేదని కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తంగా బయాలజీలో 40కి పైగా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలిగామని కొందరు విద్యార్థులు పేర్కొన్నారు. కెమిస్ట్రీ విభాగంలో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చిన ప్రశ్నలు కొంత కఠినంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు.
సమయపాలనపై ప్రభావం
సాధారణంగా విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించిన తర్వాత ఫిజిక్స్‌పై దృష్టి సారిస్తారు. అయితే, ఈసారి బయాలజీ, కెమిస్ట్రీ విభాగాల్లో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉండటంతో వాటికి ఎక్కువ సమయం పట్టింది. చివరగా ఫిజిక్స్ ప్రశ్నలను చూసిన విద్యార్థులు, వాటి కఠినత్వం కారణంగా మరింత ఒత్తిడికి లోనయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వారికంటే రెగ్యులర్ విద్యార్థులే కొంత మెరుగ్గా రాణించే అవకాశం ఉందని నీట్ శిక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గరిష్ఠ మార్కులపై నీలినీడలు
గత రెండు సంవత్సరాల్లో మాదిరిగా ఈసారి 720కి 720 మార్కులు సాధించడం కష్టసాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు. ఫిజిక్స్ పేపర్ కఠినత్వం మొత్తం స్కోర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని, 2018లో నమోదైన 691 మార్కుల తరహాలోనే ఈసారి టాపర్ స్కోర్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.