Henry Betsey Jr: ఒకరికి తెలియకుండా మరొకరిని... ముగ్గుర్ని పెళ్లాడాడు... ఎట్టకేలకు అరెస్ట్

Florida Man Arrested for Bigamy After Marrying Three Women
  • వేర్వేరు కౌంటీలలో, ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లాడిన హెన్రీ బెట్సే జూనియర్
  • డేటింగ్ యాప్‌ల ద్వారా విడాకులు తీసుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకున్న వైనం
  • మొదటి భార్య చొరవతో వెలుగులోకి వచ్చిన బహుభార్యత్వ మోసం
  • నిందితుడిపై బహుభార్యత్వం అభియోగాలు నమోదు చేసిన పోలీసులు
సాంకేతికత పెరిగే కొద్దీ నేరాల తీరు కూడా మారుతోంది. డేటింగ్ యాప్‌లను వేదికగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. హెన్రీ బెట్సే జూనియర్ అనే వ్యక్తి, విడాకులు తీసుకున్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని, ప్రముఖ డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయం పెంచుకుని, ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఈ బహుభార్యత్వ బాగోతం బయటపడటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, ఫెలోనీ బిగామీ (తీవ్రమైన బహుభార్యత్వ నేరం) కింద అభియోగాలు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, హెన్రీ బెట్సే జూనియర్.. బంబుల్, టిండర్, స్టిర్, మ్యాచ్.కామ్ వంటి యాప్‌లలో చురుకుగా ఉండేవాడు. ముఖ్యంగా విడాకులు పొంది, తోడు కోసం చూస్తున్న మహిళలను గుర్తించి, వారితో పరిచయం పెంచుకునేవాడు. తాను ఎంతో అందగాడ్నని, స్థిరపడాలని చూస్తున్నానని నమ్మబలికేవాడు. ఇలాగే 2020లో టిండర్ ద్వారా టోన్యా అనే మహిళను పరిచయం చేసుకొని, అదే ఏడాది నవంబర్‌లో డువాల్ కౌంటీలో ఆమెను వివాహం చేసుకున్నాడు.

టోన్యాతో వివాహ బంధంలో ఉండగానే, 'స్టిర్' యాప్ ద్వారా బ్రాండీ అనే మరో విడాకులు తీసుకున్న మహిళను పరిచయం చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరిలో మానటీ కౌంటీలో ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత, మ్యాచ్.కామ్ ద్వారా మిషెల్ అనే మహిళతో పరిచయం పెంచుకుని, 2022 నవంబర్‌లో హెర్నాండో కౌంటీలో ఆమెను మూడో వివాహం చేసుకున్నాడు. ఈ మూడు సందర్భాల్లోనూ, తాను అప్పటికే వివాహితుడననే విషయాన్ని హెన్రీ అత్యంత గోప్యంగా ఉంచాడు. పెళ్లయిన కొద్ది రోజులకే ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవాలని ఒత్తిడి చేసేవాడని, ఆ తర్వాత వేధింపులకు గురిచేసేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

హెన్రీ ప్రవర్తనపై అనుమానం వచ్చిన మొదటి భార్య టోన్యా, అతని గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. ఫ్లోరిడాలోని వివిధ కౌంటీల పబ్లిక్ రికార్డులను పరిశీలించగా, బ్రాండీ, మిషెల్‌లతో హెన్రీకి జరిగిన వివాహాల రిజిస్ట్రేషన్ పత్రాలు లభ్యమయ్యాయి. దీంతో షాక్‌కు గురైన టోన్యా, నేరుగా మిషెల్‌ను సంప్రదించి అసలు విషయం చెప్పింది. అప్పటి వరకు తమ భర్తకు వేరే భార్యలున్నారనే విషయం తెలియని మిషెల్, వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

టోన్యా అందించిన ఆధారాలు, మిషెల్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, గత ఏడాది సెమినోల్ కౌంటీలో హెన్రీ బెట్సే జూనియర్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై బహుభార్యత్వం కింద తీవ్ర అభియోగాలు మోపారు. 
Henry Betsey Jr
Bigamy
Florida Bigamy Case
Dating App Scams
Tinder
Bumble
Stir
Match.com
Online Dating Fraud
Florida Police

More Telugu News