Chiranjeevi: జగదేకవీరుడు అతిలోకసుందరి రూ.6.50 టికెట్ ను రూ.210కి అమ్మారట!... బ్లాక్ లోనూ రికార్డే!

Jagadeka Veerudu Atiloka Sundari Rs 6 Ticket Sold for Rs 210
  • మే 9న 'జగదేక వీరుడు అతిలోక సుందరి' రీ-రిలీజ్
  • సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ-రిలీజ్
  • నాటి క్రేజ్: తొలి షోకే రూ.6.50 టికెట్ ₹210కి అమ్మకం
  • చిత్రీకరణ నాటి ఆసక్తికర విశేషాలు పంచుకున్న చిరు, రాఘవేంద్రరావు, అశ్వినీదత్
  • రీమాస్టర్డ్ వెర్షన్, 2D & 3D ఫార్మాట్లలో విడుదల
తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన చిత్రం 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి నాయికగా నటించిన ఈ ఐకానిక్ సోషియో ఫాంటసీ చిత్రం విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, మే 9వ తేదీన మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలకు నిలువుటద్దంగా నిలిచిన ఈ సినిమాను రీమాస్టర్ చేసి, థియేటర్లలో విడుదల చేయనున్నారు.

1990 మే 9న విడుదలైన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. తరతరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ, తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఆనాటి సినిమా క్రేజ్‌కు నిదర్శనంగా ఒక సంఘటనను గుర్తుచేసుకోవచ్చు. సినిమా విడుదలైన మొదటి రోజు మధ్యాహ్నం ఆటకే, కేవలం రూ. 6.50 విలువైన టికెట్‌ను బ్లాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 210కి కొనుగోలు చేశారంటే, ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రంలో చిరంజీవి రాజు అనే టూరిస్ట్ గైడ్‌గా కనిపించగా, శ్రీదేవి ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చిన దేవకన్య ఇంద్రజ పాత్రలో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. వీరితో పాటు అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించారు.

ఈ పాట ఒక్కరోజులోనూ ట్యూన్ ఇచ్చేశారు: చిరంజీవి

చిత్రీకరణ నాటి విశేషాలను చిత్ర యూనిట్ సభ్యులు పంచుకున్నారు. 'అబ్బనీ తీయనీ దెబ్బ' పాట గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, "ఆ పాట ఒక్క రోజులోపే స్వరపరిచారని తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. ఇళయరాజా గారు ఉదయం 9 గంటలకు పని మొదలుపెట్టి, 12-12:30 గంటల కల్లా అద్భుతమైన ట్యూన్ ఇచ్చేశారు. అది వినగానే రాఘవేంద్రరావు గారు, దత్ గారు, నేను చాలా సింపుల్‌గా, స్వీట్‌గా ఉందని భావించి వెంటనే ఓకే చేశాం. మధ్యాహ్న భోజన సమయంలో వేటూరి గారు సాహిత్యం అందించారు. బాలు గారు ఎంతో ఉత్సాహంగా పాడారు" అని వివరించారు.

అందాలలో గీతం గురించి దర్శకేంద్రుడు ఏమన్నారంటే...

మరో సూపర్ హిట్ గీతం 'అందాలలో' గురించి దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ, "కథానుసారం హీరో ఒక సామాన్య మానవుడు, హీరోయిన్ ఒక దేవత అని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలి. అది పాట ద్వారానే ప్రభావవంతంగా చెప్పగలమని భావించాం. ఆ ఆలోచనతోనే ఆ పాటను అంత గొప్పగా చిత్రీకరించాం" అని తెలిపారు.



Chiranjeevi
Sridevi
Jagadeka Veerudu Atiloka Sundari
Re-release
Tollywood
Classic Telugu Film
Box Office Record
K Raghavendra Rao
Ilayaraja
Telugu Cinema

More Telugu News