Bandi Sanjay Kumar: ఆపరేషన్ 'కగార్' ఆగదు... మావోయిస్టులతో మాటల్లేవ్: తేల్చి చెప్పిన బండి సంజయ్

- మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
- ఆపరేషన్ కగార్‌పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టీకరణ
- తుపాకీ వీడితేనే మావోలతో చర్చలు సాధ్యమంటున్న తేల్చిచెప్పిన కేంద్రం
దేశంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్' ను నిలిపివేయాలంటూ కొన్ని రాజకీయ పక్షాలు, పౌర సమాజం నుంచి డిమాండ్లు వస్తున్న వేళ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఈ ఆపరేషన్‌పై స్పందించిన తర్వాత నెలకొన్న రాజకీయ చర్చల నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కరీంనగర్‌లోని కొత్తపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్, ఆపరేషన్ కగార్ మరియు మావోయిస్టులతో చర్చల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. "తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నవాళ్లతో చర్చలు ఉండవు. వారితో మాటలు లేవు... మాట్లాడుకోవడాలు లేవు" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మావోయిస్టులను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు.
నక్సల్స్ హింసాత్మక చర్యల వల్ల ఎంతో మంది రాజకీయ నాయకులు, అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. "కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎన్నో పార్టీల నేతలను మందుపాతరలు పెట్టి చంపారు. అమాయక గిరిజనులను ఇన్‌ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మావోయిస్టులు తీరని శోకాన్ని మిగిల్చారు" అని ఆయన తెలిపారు. ఆయుధాలు వీడితే తప్ప మావోయిస్టులతో చర్చలు జరపబోమని ఆయన తేల్చిచెప్పారు.
కొన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్ఏ (NDSA) నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయనున్నారన్న వార్తల నేపథ్యంలో, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. మావోయిస్టుల విషయంలో కేంద్రం కఠినంగానే వ్యవహరిస్తుందని, చర్చలకు ఆస్కారం లేదని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.