India-Pakistan: పాకిస్థాన్‌కు భార‌త్ మ‌రో షాక్‌.. ‘బాగ్‌లిహార్‌’ నుంచి నీటి సరఫరా నిలిపివేత

India Cuts Water Supply to Pakistan from Baglihar Dam
  • ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన‌ భార‌త్‌ 
  • తాజాగా బాగ్‌లిహార్‌ ఆనకట్ట నుంచి పాక్‌కు నీటి సరఫరా బంద్‌
  • పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు ఇక్కడ నుంచి నిలిచిపోయిన‌ నీటి సరఫరా 
  • అయితే, ఇది స్వల్పకాల చర్యగా పేర్కొన్న అధికారులు
పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్థాన్‌కు దెబ్బ‌మీద దెబ్బ ప‌డుతోంది. క‌ఠిన ఆంక్ష‌ల‌తో పాక్‌ను కోలుకోని విధంగా భార‌త్‌ దెబ్బ కోడుతోంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని ర‌ద్దు చేసిన భార‌త్‌... తాజాగా బాగ్‌లిహార్‌ ఆనకట్ట నుంచి దాయాది దేశానికి నీటి సరఫరాను నిలిపివేసింది. పాక్‌ను ఎండగట్టే చర్యల్లో ఇది రెండోది. 

బాగ్‌లిహార్‌ డ్యామ్‌ నుంచి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యామ్‌ స్లూయిస్‌ స్పిల్‌వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. దాంతో పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు ఇక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. అయితే, ఇది స్వల్పకాల చర్యగా అధికారులు పేర్కొన్నారు. త‌ద్వారా అవసరమైతే భారత్‌ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్‌కు తెలియజేసిన‌ట్లైంద‌న్నారు.

900 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి కోసం ఈ డ్యామ్‌ను చినాబ్‌ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యామ్‌ పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాకిస్థాన్‌కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్‌ కూడా ఒకటి. పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఎక్కువగా పంటపొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. కాగా, ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్‌ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విష‌యం తెలిసిందే. ఇలా పహల్గామ్ పాశ‌విక‌ దాడి తర్వాత దాయాది దేశాన్ని భారత్‌ అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తోంది.
India-Pakistan
Baglihar Dam
Water Supply
Sindhu Waters Treaty
Punjab Province
Terrorism
Pulwama Attack
Indus River
Hydropower

More Telugu News