Kansas Sedgwick County Court: కొడుకును చంపిన వ్యక్తిపై కోర్టు హాల్లోనే పిడిగుద్దులు కురిపించిన తల్లి.. వీడియో ఇదిగో!

- అమెరికాలోని కాన్సాస్ కోర్టులో హత్య కేసు విచారణ సందర్భంగా గొడవ
- హంతకుడు, అతడి కుటుంబంపై బాధితుడి తల్లి, బంధువుల దాడి
- 14 ఏళ్ల బాలుడి హత్య కేసులో నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష ఖరారు
కుమారుడిని దారుణంగా హతమార్చిన వ్యక్తిపై ఆ తల్లి విరుచుకుపడింది. కన్నబిడ్డను పొట్టన పెట్టుకున్నాడనే ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో కోర్టు హాలులోనే హంతకుడిపై కలబడింది. ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడింది. బాధితుడి కుటుంబం కూడా హంతకుడిపై దాడి చేసింది. అమెరికాలోని కాన్సాస్ సెడ్జ్‌విక్ కౌంటీ కోర్టులో చోటుచేసుకుందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ట్రెన్ జేవియస్ హటన్ అనే 14 ఏళ్ల బాలుడిని టెబ్రయిస్ రాబిన్సన్ (19) హత్య చేశాడు. పోలీసులు రాబిన్సన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కుమారుడి హత్య కేసు విచారణకు ట్రెన్ జేవియస్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో రాబిన్సన్ ను కోర్టు హాల్ లో చూసిన జేవియస్ తల్లి జీనెట్ డీస్ ఆగ్రహం ఆపుకోలేకపోయింది. తన కుమారుడిని చంపిన రాబిన్సన్ ను అత్యంత కఠినంగా శిక్షించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో ఆమె నిందితుడిని, కోర్టుకు హాజరైన అతడి కుటుంబ సభ్యులను, స్నేహితులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
దీంతో కోర్టు హాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల వారు పరస్పరం దూషించుకున్నారు. ఈ క్రమంలోనే బాధితుడి కుటుంబ సభ్యుల్లో ఒకరు లేచి వెళ్లి, నిందితుడి బంధువుల్లో ఒకరిపై దాడి చేయడంతో పెద్ద గొడవ మొదలైంది. ఇరు కుటుంబాల వారు కోర్టు హాలు మధ్యలోనే బాహాబాహీకి దిగారు.
ఈ ఘటనపై స్పందించిన డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, ఘర్షణకు కారణమైన మృతుడి తల్లి జీనెట్ డీస్‌తో పాటు మరో ఐదుగురిపై (ట్రెంటాసియా హటన్, డెరిక్ పార్కర్, ట్రెంటావిస్ హటన్, ట్రెంటెజ్ హటన్, 16 ఏళ్ల బాలుడు) డిజార్డర్లీ కాండక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు సెడ్జ్‌విక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ధృవీకరించింది. జీనెట్ డీస్‌కు 500 డాలర్ల జరిమానా విధించారు. ఘర్షణ నేపథ్యంలో పలువురిని కోర్టు హాలు నుంచి బయటకు పంపిన అనంతరం, న్యాయమూర్తి హటన్ హత్య కేసులో నిందితుడు రాబిన్సన్‌కు 21 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.