Seema Haider: సీమా హైదర్ ఇంట్లోకి చొరబడిన యువ‌కుడు... క్షుద్ర‌పూజ‌లు చేసిందంటూ దాడి!

Man Breaks Into Pak Woman Seema Haiders Home
  • గ్రేట‌ర్ నోయిడాలో ఉంటున్న సీమా ఇంట్లోకి చొర‌బ‌డ్డ యువ‌కుడు
  • అత‌డిని గుజరాత్‌లోని సురేందర్ నగర్ నివాసి తేజ‌స్‌గా గుర్తించిన పోలీసులు
  • విచార‌ణ‌లో ఆమె త‌న‌పై క్షుద్ర‌పూజ‌లు చేసిందని ఆరోపించిన‌ట్లు పోలీసుల వెల్ల‌డి 
  • తేజస్ మానసిక స్థితి స‌రిగా లేద‌న్న‌ పోలీసులు
పాకిస్థాన్ నుంచి వ‌చ్చి భార‌త యువ‌కుడిని పెళ్లాడిన సీమా హైద‌ర్ ఇంటిపై శనివారం ఓ యువ‌కుడు దాడి చేశాడు. గుజరాత్‌లోని సురేందర్ నగర్ నివాసి తేజ‌స్ అనే యువ‌కుడు గ్రేట‌ర్ నోయిడాలో ఉంటున్న సీమా ఇంట్లోకి శ‌నివారం రాత్రి చొర‌బ‌డ‌గా పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. ఆమె తనపై క్షుద్ర‌పూజ‌లు చేసిందని అతడు ఆరోపించాడని పోలీసులు తెలిపారు.

అయితే, తేజస్ మానసిక స్థితి స‌రిగా లేద‌ని పోలీసులు చెప్పారు. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో సీమా ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడని వారు తెలిపారు. "అతను గుజరాత్ కు చెందినవాడు. గుజరాత్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే రైలు జనరల్ కోచ్ టికెట్ తీసుకున్నాడు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బస్సులో సీమా ఉంటున్న‌ గ్రామానికి చేరుకున్నాడు. అతని మొబైల్ ఫోన్‌లో సీమా స్క్రీన్‌షాట్‌లు ఉన్నాయి" అని రబుపుర కొత్వాలి ఇంచార్జ్ సుజీత్ ఉపాయ్ ప్ర‌ముఖ వార్త సంస్థ పీటీఐకి తెలిపారు. తేజస్‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు.

కాగా, పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన 32 ఏళ్ల సీమా హైదర్ తన న‌లుగురు పిల్లలను తీసుకొని 2023 మేలో కరాచీలోని ఇంటి నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు చేరుకుంది. అదే ఏడాది జులైలో ఆమె గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన‌ సచిన్ మీనా (27)తో క‌లిసి నివసిస్తున్నట్లు భారత అధికారులు గుర్తించ‌డంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ పెళ్లి చేసుకోవ‌డం, త‌ర్వాత వారికి ఒక కుమార్తె జన్మించడం జరిగింది. ఇక‌, ఇటీవ‌ల ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్‌లోని పాకిస్థానీయుల‌ను వారి దేశానికి వెళ్ల‌గొట్ట‌డం జ‌రిగింది. దాంతో త‌న‌ను పాక్‌కు పంపొద్ద‌ని, తాను భార‌త్‌ కోడ‌లిన‌ని ఇటీవ‌ల సీమా హైద‌ర్ ప్ర‌భుత్వాన్ని వేడుకున్న విష‌యం తెలిసిందే. 
Seema Haider
Tejas
Greater Noida
Attack
Black Magic
Sachin Meena
Pakistan
India
Gujarat
Arrest

More Telugu News