Avaneesh Kaur: ఎవరీ అవనీత్ కౌర్... విరాట్ కోహ్లీ లైక్ తో హాట్ టాపిక్ గా మారింది!

- నటి అవనీత్ కౌర్ ఫోటోతో ఉన్న పోస్ట్‌కు ఇన్‌స్టాలో కోహ్లీ 'లైక్'
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన స్క్రీన్‌షాట్లు, తీవ్ర చర్చ
- ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన విరాట్ కోహ్లీ
- దాంతో అవనీత్ కౌర్ గురించి నెటిజన్లలో ఆసక్తి
హిందీ టెలివిజన్, సినిమా రంగాల్లో నటిగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటి అవనీత్ కౌర్. చిన్న వయసులోనే కెమెరా ముందుకొచ్చి, బుల్లితెరపై మెరిసి, ఆ తర్వాత వెండితెరపై కూడా అడుగుపెట్టి తన ప్రతిభను చాటుతోంది. పంజాబ్‌లోని జలంధర్‌లో 2001లో జన్మించిన అవనీత్, వినోద రంగంలో తన ప్రయాణాన్ని ఒక డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా ప్రారంభించారు. ఇప్పుడు టీమిండియా క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పొరపాటున చేసిన ఓ లైక్ తో ఆమె ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.
జీ టీవీలో ప్రసారమైన 'డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్' కార్యక్రమంలో పోటీదారుగా పాల్గొని ఆమె తొలిసారిగా ప్రేక్షకులకు పరిచయమైంది. అనంతరం నటన వైపు దృష్టి సారించి, 2012లో ప్రసారమైన 'మేరీ మా' అనే టీవీ సీరియల్ ద్వారా నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'సావిత్రి – ఏక్ ప్రేమ్ కహానీ', 'ఏక్ ముఠ్ఠీ ఆస్మాన్', 'చంద్ర నందిని', 'అలాద్దీన్ – నామ్ తో సునా హోగా' వంటి పలు విజయవంతమైన, ప్రజాదరణ పొందిన టీవీ కార్యక్రమాల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.
అవనీత్ కౌర్ టెలివిజన్ రంగంలో రాణిస్తూనే, సినిమా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంది. 2014లో విడుదలైన 'మర్దానీ' చిత్రంతో ఆమె బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఈ సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ, అది ఆమె కెరీర్‌కు ప్లస్ అయింది. ఆ తర్వాత 'కరీబ్ కరీబ్ సింగిల్', 'మర్దానీ 2', 'చిడియాఖానా', 'లవ్ కీ అరేంజ్ మ్యారేజ్' వంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన 'టీకూ వెడ్స్ షేరు' చిత్రంలో పూర్తిస్థాయి కథానాయికగా నటించే అవకాశం దక్కించుకోవడం అవనీత్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు.
అసలేం జరిగిందంటే...!
ఇటీవల నటి అవనీత్ కౌర్‌కు సంబంధించిన ఒక ఫ్యాన్ పేజీ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా 'లైక్' చేసినట్లు కొందరు అభిమానులు గుర్తించారు. ఆ పోస్ట్ 'లైక్స్' విభాగంలో కోహ్లీ పేరు కనిపించడంతో ఆ స్క్రీన్‌షాట్లు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక సాంకేతిక లోపమా అంటూ నెటిజన్లు రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు.
ఈ విషయంపై ఆన్‌లైన్‌లో పెద్ద చర్చే నడిచింది. కొందరు దీన్ని తేలిగ్గా తీసుకున్నప్పటికీ, మరికొందరు మాత్రం అనవసరంగా రాద్ధాంతం చేస్తూ కోహ్లీ భార్య అనుష్క శర్మను ట్యాగ్ చేయడం వంటివి చేశారు. ఈ నేపథ్యంలో, అనవసరమైన పుకార్లకు తెరదించేందుకు కోహ్లీ స్వయంగా ముందుకొచ్చారు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా కోహ్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా ఫీడ్ క్లియర్ చేస్తున్న సమయంలో, అల్గారిథమ్ పొరపాటున ఒక ఇంటరాక్షన్‌ను నమోదు చేసినట్లు కనిపిస్తోంది. దీని వెనుక ఖచ్చితంగా ఎలాంటి ఉద్దేశం లేదు. దయచేసి దీనిపై అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని అభ్యర్థిస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు" అని కోహ్లీ తన సందేశంలో పేర్కొన్నారు.